IMD: గతేడాది గరం గరం... వార్షిక వాతావరణ నివేదిక విడుదల చేసిన ఐఎండీ
- 2021లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయన్న ఐఎండీ
- 5వ అత్యంత వేడి సంవత్సరం అని వెల్లడి
- చలికాలంలోనూ వేడిగానే ఉందని వివరణ
- గతేడాది ప్రకృతి విపత్తులతో 1750 మంది మృతి
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వార్షిక వాతావరణ నివేదిక విడుదల చేసింది. గతేడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, 1901 నుంచి చూస్తే 2021 సంవత్సరం అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో 5వ స్థానంలో ఉంటుందని ఐఎండీ వెల్లడించింది.
భారత్ లో గతేడాది వార్షిక సగటు ఉపరితల ఉష్ణోగ్రత 0.44 డిగ్రీల సెల్సియస్ ను మించినట్టు తెలిపింది. ఆ లెక్కన దేశంలో 2009, 2010, 2016, 2017లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలికాలంలోనూ వేడి వాతావరణం కొనసాగిందని, ముఖ్యంగా రుతుపవనాల సీజన్ ముగిసిన తర్వాత ఉష్ణోగ్రతల్లో పెరుగుదల చోటుచేసుకుందని ఐఎండీ వివరించింది.
కాగా, గతేడాది వరదలు, తుపానులు, భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడడం, పిడుగుపాటు వంటి ప్రకృతి విపత్తుల కారణంగా దేశంలో 1,750 మరణాలు సంభవించినట్టు ఐఎండీ పేర్కొంది.