Anushka Sharma: కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవడంపై అనుష్క భావోద్వేగ స్పందన
- దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ లో టీమిండియా ఓటమి
- కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ
- కోహ్లీ నిర్ణయంపై అనుష్క పోస్టు
- గర్వంగా ఉందని వెల్లడి
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ అనంతరం టీమిండియా టెస్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పడం తెలిసిందే. దీనిపై కోహ్లీ అర్ధాంగి అనుష్క శర్మ భావోద్వేగభరితంగా స్పందించింది. 2014 నాటి సంభాషణ తనకింకా గుర్తుందని, ధోనీ రిటైర్ కావడంతో కోహ్లీ కెప్టెన్ అయిన క్షణాలు తాను మర్చిపోలేదని వెల్లడించింది.
"ఆ రోజు మనం కూర్చుని మాట్లాడుకుంటుండగా, నీ గడ్డం తెల్లబడుతోందంటూ ధోనీ జోక్ చేయడం నాకు జ్ఞప్తికి వస్తోంది. ఆ సమయంలో మనం ఎంతో నవ్వుకున్నాం. ఆ తర్వాత నీ గడ్డం తెల్లబడడం కంటే ఎంతో ఉన్నతస్థాయికి ఎదిగావు. నీలోనూ, నీచుట్టూ ఎంతో ఎదిగావు. భారత జట్టు కెప్టెన్ గా నువ్వు సాధించిన ఘనతలు, నీ సారథ్యంలో జట్టు సాధించిన విజయం పట్ల ఎంతో గర్విస్తున్నాను.
2014లో మనం చాలా చిన్నవాళ్లం, కల్మషం లేనివాళ్లం. కానీ ఈ ఏడేళ్లలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నావు. మైదానంలోనే కాదు, వెలుపల కూడా సవాళ్లకు ఎదురొడ్డి నిలిచావు. నీ మంచి ఆలోచనలకు అడ్డం వచ్చేందుకు ఏ ఒక్క చెడు అంశాన్ని నువ్వు అనుమతించలేదు. అందుకు నాకెంతో గర్వంగా ఉంది.
కొన్ని పరాజయాల అనంతరం నీ పక్కన కూర్చున్న నాకు నీ కళ్లలో నీళ్లు కనిపించాయి. నువ్వు ముక్కుసూటిగా వ్యవహరిస్తావు. నటించడం నీకు చేతకాదు. అందుకే నా కళ్లకు, అభిమానుల కళ్లకు గొప్పగా కనిపిస్తావు. స్వార్థం లేని నీవు ఏది మంచి అనిపిస్తే అది చేసేందుకు దృఢంగా నిలబడ్డావు. ఈ ఏడేళ్లలో నీవు ఎదిగిన తీరు మన పాపాయి నీలో చూస్తుంది" అంటూ అనుష్క ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.