Nara Lokesh: ఏపీలో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంది: సీఎం జగన్‌కు లోకేశ్ లేఖ
- కరోనా కేసులు పెరుగుతున్నాయి
- 15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు
- విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడకూడదు
- విద్యా సంస్థలకు సెలవులు పొడిగించాలన్న లోకేశ్
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగించాలని సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ లేఖ రాశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వివరించారు.
'కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి లేఖ రాశాను. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూల్స్ కి సెలవులు ప్రకటించాయి' అని గుర్తు చేశారు.
'15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడకూడదు. తల్లిదండ్రులను మరింత మానసిక ఆందోళనకు గురిచెయ్యకుండా ప్రభుత్వం తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలి' అని లోకేశ్ కోరారు.