Himalayas: హిమాలయాల్లో కరోనాకు అడ్డుకట్ట వేసే మొక్క: గుర్తించిన శాస్త్రవేత్తలు
- రోడోడెండ్రాన్ అర్బోరియం అనే మొక్క గుర్తింపు
- ఈ మొక్క పువ్వుల్లో ఫైటోకెమికల్స్
- కొవిడ్ చికిత్సలో ఫైటోకెమికల్స్ది కీలక పాత్ర
ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని అల్లాడిస్తున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే ఓ మొక్క హిమాలయాల్లో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. హిమాలయాల్లోని ‘రోడోడెండ్రాన్ అర్బోరియం’ అనే మొక్క పువ్వులో కొవిడ్ చికిత్సలో అత్యంత కీలకమైన ఫైటోకెమికల్స్ ఉన్నట్టు హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఢిల్లీలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజినీరింగ్ అండ్ బయో టెక్నాలజీ (ఐసీజీఈబీ) శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
స్థానికంగా ఈ మొక్కను ‘బురాన్ష్’ అని పిలుస్తారు. ఇందులోని ఫైటోకెమికల్స్ కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ అధ్యయన వివరాలు ‘బయోమాలిక్యులర్ స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. తాము గుర్తించిన బుర్షాన్ మొక్క పూరేకులను స్థానికులు రకరకాల చికిత్సలో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారని ఐఐటీ మండీ అసోసియేట్ ప్రొఫెసర్ శ్యామ్ కుమార్ మసకపల్లి తెలిపారు.