KCR: వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్న కేసీఆర్
- వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన వరంగల్ జిల్లా రైతులు
- వ్యక్తిగతంగా పర్యటించి రైతుల కష్టాలు తెలుసుకోవాలనుకున్న కేసీఆర్
- అనివార్య కారణాల వల్ల పర్యటనను రద్దు చేసుకున్న సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఇటీవల కురిసిన వడగండ్ల వర్షాలు రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఈ విషయాన్ని సీఎం దృష్టికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీసుకెళ్లారు. దీంతో, వరంగల్ జిల్లాలో స్వయంగా పర్యటించి పరిస్థితిని తెలుసుకోవాలని కేసీఆర్ భావించారు.
అయితే అనివార్య కారణాల వల్ల వరంగల్ పర్యటనను కేసీఆర్ రద్దు చేసుకున్నారు. దీంతో వరంగల్ జిల్లాలో మంత్రుల బృందం పర్యటించనుంది. మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి, వ్యవసాయశాఖ ఫీల్డ్ అధికారులు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. పంటనష్టాన్ని అంచనా వేసి నివేదికను ముఖ్యమంత్రి కార్యాలయానికి అందించనున్నారు.
మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రూ. 960 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కంది, బొప్పాయి, మొక్కజొన్న, మిరప, కూరగాయల పంటలకు వంద శాతం నష్టం వాటిల్లిందని వారు చెపుతున్నారు.