President Biden: మరోసారి కమలా హారిస్ తో కలసే ప్రజాక్షేత్రంలోకి: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటన
- 2024లో ఆమెతో కలసే ఎన్నికల బరిలోకి
- స్పష్టత నిచ్చిన అమెరికా అధ్యక్షుడు
- కమలా హారిస్ పనితీరుకు మద్దతు
అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్ తో కలసే మరో విడత ప్రజల ముందుకు వెళ్లనున్నట్టు ఆ దేశాధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. 2024 ఎన్నికల్లోనూ ఆమె తన సహచరణిగా ఉంటారని తెలిపారు. అధ్యక్షుడిగా ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా బైడెన్ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ సందర్భానికి వేదికైంది.
2024 ఎన్నికల గురించి తాను, బైడెన్ ఇంకా చర్చించుకోలేదని గత నెలలో కమలా హారిస్ ప్రకటించడం గమనార్హం. ఒకవేళ బైడెన్ ఆమెను ఎంపిక చేసుకోకపోతే పోటీకి ఆమె దూరంగా ఉంటారన్న వార్తలు వచ్చాయి. అమెరికా చరిత్రలోనే తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమల చరిత్ర సృష్టించడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కమల పనితీరు పట్ల బైడెన్ సంతృప్తిగానే ఉన్నారు. ఓటింగ్ హక్కుల అంశం పరిష్కారంలో ఆమె పనితీరుకు మద్దతు పలికారు. ‘‘నేను ఆమెకు బాధ్యతలు అప్పగించాను. తన ధర్మాన్ని ఆమె చక్కగానే నిర్వహించారు’’ అని బైడెన్ ప్రకటించారు.