Corona Virus: చాతీ ఎక్స్‌రేతో నిమిషాల్లోనే పక్కాగా కొవిడ్ నిర్ధారణ!: తాజా అధ్యయనంలో వెల్లడి
- 3 వేల మంది ఎక్స్‌రేలను పరిశీలించిన పరిశోధకులు
- 98.04 కచ్చితత్వంతో నిర్ధారిస్తున్న ఏఐ ఆధారిత టెక్నాలజీ
- ఆర్టీపీసీఆర్కు ప్రత్యామ్నాయం కాబోదంటున్న పరిశోధకులు
కరోనా వైరస్ సోకిందీ, లేనిదీ నిర్ధారించుకోవడానికి ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటిలోనూ ముక్కులోంచి నమూనాలు సేకరిస్తారు. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో నిమిషాల వ్యవధిలోనే ఫలితం వచ్చేస్తుంది. ఆర్టీపీసీఆర్ ఫలితం రావాలంటే మాత్రం ఒక రోజు పడుతుంది. ఇక, ర్యాపిడ్ టెస్టు ఫలితాన్ని నమ్మడానికి వీలు లేదు కాబట్టి ఆర్టీపీసీఆర్ టెస్టు ఫలితాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
అయితే, ఈ తతంగమేమీ లేకుండా నిమిషాల వ్యవధిలో పూర్తి కచ్చితత్వంతో కరోనా వైరస్ సంక్రమణను గుర్తించొచ్చని అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ ద వెస్ట్ ఆఫ్ స్కాట్లాండ్ (యూడబ్ల్యూఎస్) పరిశోధకులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో చాతీ ఎక్స్‌రే ద్వారా కొవిడ్‌ను నిర్ధారించొచ్చని నిరూపించారు. ఇందుకోసం వారు తొలుత ఆరోగ్యవంతులైన, కొవిడ్ సోకిన, న్యూమోనియా రోగులకు చెందిన 3 వేల మంది ఎక్స్‌రేలను పోల్చి చూశారు.
అనంతరం అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ద్వారా ఎక్స్‌రేలను పరిశీలించి కొవిడ్ సోకిందీ, లేనిదీ 98.04 శాతం కచ్చితత్వంతో నిర్ధారించారు. అయితే, కరోనా సోకిన తొలి దశలో తీసే ఎక్స్‌రేలో ఎలాంటి లక్షణాలు కనిపించవని, కాబట్టి ఇది ఆర్టీపీసీఆర్ టెస్టుకు ప్రత్యామ్నాయం మాత్రం కాబోదని యూడబ్ల్యూఎస్ పరిశోధకులు స్పష్టం చేశారు.