Samajwadi Party: తొలిసారి ఎన్నికల బరిలోకి అఖిలేశ్ యాదవ్.. కర్హాల్ నుంచి పోటీ
- ఎస్పీకి కంచుకోటగా కర్హాల్ నియోజకవర్గం
- 1993 నుంచి అక్కడ వరుస విజయాలు
- ఒక్క 2002లో మాత్రం బీజేపీ వశం
- తిరిగి 2007లో ఎస్పీ కైవసం
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ తొలిసారి ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీకి కంచుకోట అయిన మైన్పురీ జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్టు ఆయన బాబాయ్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్ యాదవ్ తెలిపారు.
కర్హాల్ నియోజకవర్గం 1993 నుంచి ఎస్పీకి కంచుకోటగా నిలుస్తూ వస్తోంది. అక్కడ ప్రతిసారి ఎస్పీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే, 2002లో మాత్రం బీజేపీ ఆ స్థానాన్ని కైవసం చేసుకోగా, 2007లో తిరిగి ఎస్పీ దక్కించుకుంది. ప్రస్తుతం ఎస్పీ నేత శోభారన్ యాదవ్ ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.