Elections: ప్రజాధనంతో ‘ఉచితాలా’?.. ఆ హామీలిచ్చే రాజకీయ పార్టీలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్
- ఇలాంటి హామీలు ఎన్నికలను అపవిత్రం చేసేవే
- ఇవన్నీ ఓటర్లను ప్రభావితం చేస్తాయి
- వీటితో ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం
- సమానత్వపు హక్కును ధిక్కరించేవంటూ ప్రకటించాలని విజ్ఞప్తి
‘‘మేం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు రూ.6 వెయ్యిస్తాం.. మేమొస్తే మహిళలకు రూ.వెయ్యిస్తాం.. దళితులకు రూ.10 లక్షలతో దళితబంధునిస్తాం..’’ ఇలా ఎన్నెన్నో ఉచితాల హామీలను రాజకీయ పార్టీలు ఇస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అధికారంలోకి వచ్చేందుకు ఎన్ని ‘ఫ్రీ’ హామీలైనా ఇచ్చేందుకు అవి వెనుకాడడం లేదు. అయితే, దీనిపై ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ప్రజాధనంతో ఉచిత హామీలను ప్రకటించే రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని, ఆ పార్టీ గుర్తును, గుర్తింపును రద్దు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ అడ్వొకేట్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ప్రజల ఓట్లను కొల్లగొట్టేందుకు ఉచిత హామీలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. కాబట్టి ఎన్నికలకు ముందు ఇచ్చే ఇలాంటి హామీలు ఓటర్లను ప్రభావితం చేసేవని, ఎన్నికల ప్రక్రియను అపవిత్రం చేసేవంటూ ప్రకటించాలని పిటిషన్ లో సుప్రీంకోర్టును కోరారు. ఇలాంటి వాటి వల్ల ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్రీ హామీలూ లంచాల్లాంటివేనని, అనైతిక చర్య అని కోర్టుకు విన్నవించారు.
ఎన్నికలకు ముందు సామగ్రి, ప్రైవేటు సరుకులను పంచడం రాజ్యాంగంలోని సమానత్వపు హక్కును ప్రసాదించే అధికరణం 14ను ధిక్కరించేదేనని ప్రకటించాలని కోరారు. ప్రస్తుతం జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత హామీలను పిటిషనర్ ప్రస్తావించారు.