acidity: అలవాట్ల వల్లే అసిడిటీ.. వీటిని దూరం పెడితే చాలు!
- ఒకే విడత ఎక్కువ ఆహారం తీసుకోవద్దు
- కొద్ది మొత్తంలో ఎక్కువ సార్లు తీసుకోవాలి
- తిన్న వెంటనే పడకకు దూరంగా ఉండాలి
- టీ, కాఫీ, ఆల్కహాల్ ను తగ్గించాలి
ఒకప్పుడు చాలా అరుదుగా ఎవరో ఒకరిలో అసిడిటీ, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు కనిపించేవి. కానీ, నేడు యువకుల నుంచి వయసుమళ్లిన వారి వరకు ఎక్కువ మందిలో ఇవి సాధారణంగా మారిపోయాయి. జీవనశైలి మారిపోవడమే అసిడిటీ (ఆమ్ల తత్వం పెరగడం)కి దారితీస్తోందని తెలుసుకోవాలి.
శారీరక శ్రమ ఉండదు. పైగా తీసుకునే ఆహారంతో అధిక కేలరీలు శరీరంలోకి చేరతాయి. దీంతో పేగుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. టీ, కాఫీలు అధికంగా తీసుకోవడం, శీతలపానీయాలు, తిన్న వెంటనే కునుకు తీయడం ఇలాంటి అలవాట్లు సమస్యను పెద్దవి చేస్తాయి.
దీన్నుంచి బయటకు రావాలంటే జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. ఎక్కువ నీరు తీసుకోవడం, సరిపడా నిద్రపోవడం, యోగ, ప్రాణాయామం, శారీరక వ్యాయామాలు అసిడిటీ సమస్య నుంచి బయటకు వచ్చేలా సాయపడతాయి. ఒత్తిడి తగ్గించుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. కొంచెం పరిమాణంలో ఎక్కువ సార్లు ఆహారం తీసుకునే విధానం అనుసరించాలి.
* అధిక కారం, మసాలాలు, ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు, స్నాక్స్, ఫ్రైడ్, ఫాస్ట్ ఫుడ్స్ ను పూర్తిగా దూరం పెట్టాలి. ఎందుకంటే వీటిని జీర్ణం చేసేందుకు కాలేయం కష్టపడాల్సి వస్తుంది. దాంతో అధిక జీర్ణ రసాలు విడుదలై, ఆమ్లతత్వం పెరిగిపోతుంది. ఇది గుండె మంటకు దారితీస్తుంది.
* ఒకేసారి పెద్ద మొత్తంలో ఆహారం తీసుకోకుండా ఉండాలి. అంటే మధ్యాహ్నం, రాత్రి కడుపునిండా లాగించడానికి బదులు.. మూడు నుంచి నాలుగు సార్లు మినీ మీల్స్ తీసుకోవాలి.
* పుల్లటి పదార్థాలు, పండ్లకు (నారింజ/కమలా, బెర్రీలు) దూరంగా ఉండాలి
* కడుపును ఖాళీగా ఎక్కువ సమయం పాటు ఉంచిన సందర్భాల్లోనూ కడుపులో మంట వస్తుంది. ఆకలి వేసిన వెంటనే కొద్ది మొత్తంలో ఆహారం తీసుకోవాలి.
* తిన్న వెంటనే కాకుండా రెండు గంటలపాటు అయినా కాలక్షేపం చేయాలి. తిన్న తర్వాత పడుకునే సందర్భాల్లో బోర్లా, నిటారుగా కాకుండా ఎడమ చేతివైపు తిరిగి పడుకోవాలి.
* ఆస్పిరిన్ మాత్రలు, టీ, కాఫీ, ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి.
* ఒకవేళ ఒత్తిడి కారణంగా అయితే ప్రాణాయామం, యోగాతో తగ్గించుకోవాలి. తగ్గకపోతే వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి.