GHMC: ప్రహరీ గోడ కూల్చేందుకు ఎంపీ సీఎం రమేశ్ ఇంటికి మళ్లీ వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులు
- హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో అక్రమ నిర్మాణం
- ఫుట్‌పాత్‌ను ఆక్రమించి ప్రహరీ గోడ
- ఇటీవలే కూల్చేసిన జీహెచ్ఎంసీ సిబ్బంది
- మళ్లీ నిర్మించిన సీఎం రమేశ్
హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 66లో ఫుట్‌పాత్‌ను ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టారంటూ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఇంటికి జీహెచ్ఎంసీ అధికారులు ఈరోజు మరోసారి వెళ్లారు. కొన్ని రోజుల క్రితమే సీఎం రమేశ్‌కు చెందిన ప్రహరీ గోడను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చి వేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
అయితే, ఆ ప్రహరీ గోడ కూల్చిన చోటే మరో ప్రహరీగోడను నిర్మించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. దాన్ని మళ్లీ కూల్చేస్తామని చెబుతున్నారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం రమేశ్ సిబ్బంది మాట్లాడుతున్నారు. దీంతో మరోసారి అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చేసేందుకు ఇప్పటికే అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.