Chinna Jeeyar Swamy: తెలంగాణ గవర్నర్ ను కలిసిన చినజీయర్ స్వామి... రామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు రావాలంటూ ఆహ్వానం
- రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు
- ముచ్చింతల్ లో విగ్రహావిష్కరణ
- ప్రముఖులను ఆహ్వానిస్తున్న చినజీయర్
- ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ఉత్సవాలు
విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి నడుం బిగించారు. హైదరాబాదు శివారు శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ ఆశ్రమంలో ఈ ఉత్సవాలను ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రామానుజాచార్యుల విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహం ఎత్తు 216 అడుగులు.
ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అనేకమంది ప్రముఖులను చినజీయర్ స్వామి స్వయంగా ఆహ్వానిస్తున్నారు. తాజాగా ఆయన తెలంగాణ రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసి రామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా ఆహ్వానపత్రిక అందజేశారు.
కాగా, విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు హాజరుకానున్నారు.