Andhra Pradesh: రేపటి నుంచి మా ఇళ్లపై దాడులు జరగొచ్చు.. అరెస్టులు చేయవచ్చు: ఏపీ ఉద్యోగసంఘం నేత బండి శ్రీనివాసరావు
- ప్రభుత్వం ఏం చేసినా మేము భయపడం
- కొత్త జీతాలు వద్దని మేము చెపుతున్నా ప్రభుత్వం ఇస్తానంటోంది
- ప్రభుత్వం ఇచ్చేది పీఆర్సీ కాదు.. రివర్స్ పీఆర్సీ
పీఆర్సీ అంశంలో ఏపీ ప్రభుత్వంపై సమరశంఖం పూరించిన ఏపీ ఉద్యోగులు తమ ఆందోళనలను ఉద్ధృతం చేయబోతున్నారు. మరోవైపు ఉద్యోగసంఘం నేత బండి శ్రీనివాసరావు ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి ప్రభుత్వం తమను ఏమైనా చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. తమ ఇళ్లపై దాడులు జరగొచ్చని, తమను అరెస్ట్ చేయవచ్చని చెప్పారు. ప్రభుత్వం ఏం చేసినా తాము మాత్రం భయపడే ప్రసక్తే లేదని అన్నారు.
సమ్మె చేయడం ఉద్యోగుల హక్కు అని బండి శ్రీనివాసరావు చెప్పారు. తమకు పీఆర్సీ ఒక్కటే సమస్య అని... ఆర్టీసీ ఉద్యోగులకు అన్నీ సమస్యలేనని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టయిందని చెప్పారు. ఈహెచ్ఎస్ కార్డులతో ఆర్టీసీ కార్మికులకు వైద్యం అందడం లేదని అన్నారు.
కొత్త జీతాలు తమకు వద్దని తాము చెపుతున్నప్పటికీ... ప్రభుత్వం కొత్త జీతాలు ఇస్తానంటోందని విమర్శించారు. ప్రభుత్వం తమకు ఇచ్చేది పీఆర్సీ కాదని... రివర్స్ పీఆర్సీ అని ఎద్దేవా చేశారు. ఏ పీఆర్సీ ప్రకారం 14.29 శాతం ఫిట్ మెంట్ ను ఇస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే కచ్చితంగా సమ్మె చేస్తామని స్పష్టం చేశారు.