Bopparaju Venkateswarlu: మీ చుట్టూ తిరిగినప్పుడు ఎక్కడికి పోయారు మీరు?: సజ్జలను ప్రశ్నించిన బొప్పరాజు
- ఉద్యోగులు చర్చలకు రావడంలేదన్న సజ్జల
- మంత్రులు ప్రతిరోజూ సచివాలయానికి వస్తున్నారని వెల్లడి
- ఇప్పటివరకు తమ లేఖలకు జవాబు లేదన్న బొప్పరాజు
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలతో తమ జీతాలు, పెన్షన్లకు తీవ్ర నష్టం జరుగుతోందని, ఆ జీవోలు రద్దు చేయాల్సిందేనని ఏపీ ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త పీఆర్సీ జీవోలను ప్రభుత్వం రద్దు చేసేంతవరకు ఉద్యమం ఆపబోమని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
కాగా, ప్రతిరోజు మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చల కోసం సచివాలయంలో ఉంటున్నా, ఉద్యోగ సంఘాల నేతలు రావడంలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దీనిపై ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు బదులిచ్చారు.
"డిసెంబరులో ఇచ్చిన జీతాల తరహాలోనే పాత పద్ధతిలో జనవరి మాసపు జీతాలు ఇవ్వాలంటూ ఈ నెల 21న పీఆర్సీ సాధన సమితి తరఫున ఏపీ సీఎస్ కు లేఖ ఇచ్చాం. దానిపై నేటికీ సమాధానం లేదు. మా వాదనలు వినిపించేందుకు ఇదే మంత్రుల కమిటీకి 25వ తేదీన లిఖితపూర్వకంగా డిమాండ్ల చిట్టా అందించాం. మాకు ఏర్పడిన అపోహలు తొలగించేందుకు ఆ కమిటీ వేశామంటున్నారు. ఆ కమిటీకి మేం ఇచ్చిన లేఖకు ఇంతవరకు సమాధానం లేదు.
మాకు ఏం కావాలో లేఖలో స్పష్టంగా చెప్పాం. ఇక్కడ ఎవరికి అర్థం కావడంలేదో మీరే ఆలోచించుకోవాలి. మేం ఇచ్చిన లేఖలకు సమాధానం ఇవ్వకపోగా, ప్రజలకు, ఉద్యోగులకు తప్పుడు సమాచారం పంపిస్తున్నారు. మేం నాలుగైదు రోజుల నుంచి ప్రతిరోజూ సచివాలయానికి వస్తుంటే ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం చర్చలకు రావడంలేదు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఉద్యోగ సంఘాల నేతలకు పరిణతి ఉందో లేదో తెలియడంలేదు, వీళ్లు కాకపోతే ఇంకెవరైనా నాయకులు ఉంటే రావొచ్చు... సమస్యలు పరిష్కరిస్తాం అని ప్రచారం చేస్తున్నారు.
మీ చుట్టూ మేం తిరిగినప్పుడు ఎక్కడిపోయారండీ సజ్జల గారూ? మేం మీ చుట్టూ తిరగలేదా? ఎన్నిసార్లు వచ్చాం మీ వద్దకు? 11వ పీఆర్సీపై చర్చిద్దామని మీరు అన్నారా లేదా? 40 పాయింట్లపై గంటన్నరపాటు మీరు చర్చించారా? లేదా? ఆర్థికమంత్రి, రాష్ట్ర సీఎస్, ఆర్థిక శాఖ అధికారులే అందుకు సాక్షి. ప్రభుత్వం చేసిన అన్ని ప్రకటనలకు మీరు సాక్షి" అంటూ బొప్పరాజు నిలదీశారు