Mega Auction: ఎవరినీ కాపీ కొట్టాలనుకోవడం లేదు.. లక్నో కొత్త జట్టు నిర్మాణంపై గౌతమ్ గంభీర్
- మాదైన విధానం మాకు ఉంది
- జట్టు నిర్మాణం గొప్ప అవకాశం
- గతంలో సాధ్యం కానిది చేసి చూపిస్తామన్న గౌతమ్
లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఐపీఎల్ 2022 సీజన్ తో కొత్తగా ప్రయాణం మొదలు పెట్టనుంది. ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూపు ఈ ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ను మెంటార్ గా నియమించుకుంది. ఇప్పుడు జట్టు నిర్మాణంలో అతడు కీలకంగా వ్యవహరించబోతున్నాడు.
మరోపక్క, ఇప్పటికే కేఎల్ రాహుల్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోయ్ లను వేలానికి ముందే ఈ ఫ్రాంచైజీ తీసుకుంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరిగే ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది.
ఈ క్రమంలో, జట్టు నిర్మాణంపై గౌతమ్ గంభీర్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ‘‘ఒక ఆస్తి (కొత్త జట్టు)ని ఏర్పాటు చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. మేము ఎవరినీ కాపీ కొట్టాలనుకోవడం లేదు. మాకంటూ ఓ విధానం ఉంది. మాదైన వారసత్వాన్ని కలిగి ఉండాలి.
సంజీవ్ సర్ పూణె ఫ్రాంచైజీని లోగడ కలిగి ఉన్న సమయంలో ఒక్క పరుగు తేడాతో టైటిల్ ను కోల్పోయారు. నాడు సాధించలేని దాన్ని మేము ఇప్పుడు సాధించగలగాలి అనేది మాకు ఓ పెద్ద ఛాలెంజ్. ఇది ఏడాదిలో సాధ్యమవుతుందని హామీ ఇవ్వలేము. దీర్ఘకాలిక ప్రక్రియ. కేవలం ఈ ఏడాది కోసమే ఆలోచించేది కాదు ఇది’’ అని గౌతమ్ వివరించాడు.