Catches: మహానాగును ఒంటి చేత్తో అలవోకగా పట్టేసిన థాయిలాండ్ వలంటీర్
- థాయిలాండ్ లోని క్రాబి ప్రావిన్స్ లో ఘటన
- పామాయిల్ ప్లాంటేషన్ లోకి చొరబడిన పాము
- స్థానికుల సమాచారంతో రంగంలోకి నిపుణుడు నౌహాద్
నాగుపాము (కింగ్ కోబ్రా)ను పట్టుకోవడం ఎంతో నైపుణ్యం ఉన్న వారికే సాధ్యం. థాయిలాండ్ కు చెందిన ఓ వలంటీర్ అది కూడా 14 అడుగుల పొడవు, 10 కిలోలకు పైగా బరువున్న కోబ్రాను చాలా అలవోకగా ఒక్క చేత్తోనే పట్టేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసేదే.
దక్షిణ ప్రావిన్స్ క్రాబి పరిధిలో ఓ రోజు అధికారులకు కోబ్రా గురించి సమాచారం వచ్చింది. పామాయిల్ తోటలోకి చొరబడిన కోబ్రా ఓ చోట నక్కినట్టు స్థానికులు తెలియజేయడంతో.. అధికారులు నిపుణుడైన వలంటర్ సుతీ నౌహాద్ (40) ను పంపించారు. 20 నిమిషాల శ్రమ తర్వాత అతడు కోబ్రాను తన చేతుల్లో బంధించేసి తీసుకెళ్లి సమీప అడవిలో విడిచి పెట్టేశాడు.
ముందుగా తోట నుంచి ఆ పామును రోడ్డుపైకి రప్పించాడు. ఇక అక్కడ తనకు తెలిసిన విద్యను ప్రదర్శించాడు. కోబ్రా కాటు వేయబోయినా అతడు చాకచక్యంగా దాన్ని అధిగమించడం వీడియోలో కనిపిస్తుంది. దీన్ని ఫేస్ బుక్ లో నౌహాద్ షేర్ చేసుకోవడంతో సంచలనంగా మారి ఎక్కువ మందిని చేరుకుంటోంది. తన మాదిరిగా ఎవరూ ప్రయత్నించొద్దని, ఎన్నో ఏళ్ల శిక్షణ తర్వాత ఆ నైపుణ్యాలు తనకు అలవడినట్టు అతడు సూచించాడు.