Keerthi Suresh: కీర్తి సురేశ్ ఇక ఆ వైపుకు వెళ్లకపోవడమే మంచిదేమో!
- 'మహానటి'తో భారీ క్రేజ్
- నాయిక ప్రధానమైన కథలవైపుకు మొగ్గు
- నిరాశ పరిచిన 'పెంగ్విన్' .. 'మిస్ ఇండియా'
- అదే దారిలో 'గుడ్ లక్ సఖి'
కీర్తి సురేశ్ బలమైన సినిమా నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చింది. తెలుగు .. తమిళ భాషల్లో తన టాలెంట్ తోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో 'నేను శైలజ' సినిమాతో పరిచయమైన ఆమె, 'మహానటి' సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైపోయింది. ఆ సినిమాతో ఆమె క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. అనూహ్యమైన రీతిలో అభినందనలు .. ఆ వెనుకనే అవకాశాలు వచ్చి వాలాయి.
అయితే 'మహానటి' తరువాత కీర్తి సురేశ్ నాయిక ప్రధానమైన పాత్రలను ఎక్కువగా ఎంచుకుంటూ వెళ్లింది. అలా ఆమె చేసిన 'పెంగ్విన్' .. 'మిస్ ఇండియా' సినిమాలు పరాజయం పాలయ్యాయి. 'మహానటి' కథ వేరు .. దాని దారి వేరు .. తీరు వేరు అనే విషయం అర్థమయ్యేలోగా, కీర్తి సురేశ్ 'గుడ్ లక్ సఖి' చేసింది. అనేక అవాంతరాలను దాటుకుని నిన్ననే ఈ సినిమా థియేటర్లకు వచ్చింది.
'గుడ్ లక్ సఖి' సినిమా కూడా కీర్తి సురేశ్ అభిమానులను నిరాశపరిచిందనే రివ్యూలు వచ్చాయి. ఆశించిన స్థాయిలో ఈ సినిమా లేదనే అభిమానులు కూడా చెబుతున్నారు. సాధారణంగా కథానాయికలు తమ జోరు తగ్గిన తరువాతనే నాయిక ప్రధానమైన పాత్రలను చేస్తుంటారు. కానీ మంచి స్టార్ డమ్ నడుస్తుండగా అలాంటి కథలవైపు అడుగులు వేసి కీర్తి పొరపాటు చేసిందని అంటున్నారు. ఇక కొంతకాలం పాటు ఆమె ఆ వైపుకు వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.