Vellampalli Srinivasa Rao: వినోద్ జైన్ వంటి నీచులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు: మంత్రి వెల్లంపల్లి
- విజయవాడలో బాలిక ఆత్మహత్య
- టీడీపీ నేత వినోద్ జైన్ పై ఆరోపణలు
- సస్పెండ్ చేసిన టీడీపీ
- చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ వెల్లంపల్లి డిమాండ్
విజయవాడలో 9వ తరగతి బాలిక ఆత్మహత్య వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. బాలిక ఆత్మహత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత వినోద్ జైన్ ను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. దీనిపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో స్పందించారు. వినోద్ జైన్ తనను ఎలా ఇబ్బందిపెట్టాడో ఆ బాలిక మూడు పేజీల సూసైడ్ నోట్ రాసిందని వెల్లడించారు. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే సరిపోదని, బాలిక ఆత్మహత్యపై చంద్రబాబు సమాధానం చెప్పాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు.
అసలు, అంత వయసున్న వ్యక్తికి ఈ బుద్ధి ఎలా వచ్చిందోనని అన్నారు. ఈ ఘటనపై ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని, వినోద్ జైన్ ను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. వినోద్ జైన్ ఎంపీ కేశినేని నానికి ముఖ్య అనుచరుడు అని, ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో అతడి కోసం చంద్రబాబు కూడా ప్రచారం చేశాడని వెల్లంపల్లి ఆరోపించారు. ఇలాంటి నీచులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నాడని, అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు.