Akhilesh Yadav: 'యూపీలో నేరాలు-ఘోరాలు' అంశంపై అమిత్ షా సవాల్ ను స్వీకరించిన అఖిలేశ్ యాదవ్

Akhilesh Yadav accepts Amit Shah challenge to discuss crime rate in state
  • త్వరలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు
  • బీజేపీ, సమాజ్ వాదీ మధ్య మాటల యుద్ధం
  • నేరాల సంఖ్యపై పరస్పర ఆరోపణలు
  • నేరాల సంఖ్య వెల్లడించాలన్న అమిత్ షా
  • టైమ్, ప్లేస్ చెప్పండి వస్తా... అంటూ అఖిలేశ్ రిప్లయ్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి మరింత రాజుకుంది. అధికార బీజేపీ, విపక్ష సమాజ్ వాదీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మీ హయాంలోనే రాష్ట్ర శాంతిభద్రతలు దారుణంగా తయారయ్యాయని అమిత్ షా, అఖిలేశ్ యాదవ్ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు.

యూపీలో బీజేపీ ఎన్నికల రథసారథిగా వ్యవహరిస్తున్న అమిత్ షా దీనిపై సవాల్ విసిరారు. ఎవరి హయాంలో నేరాలు-ఘోరాలు ఎక్కువగా జరిగాయో చర్చకు రావాలని అఖిలేశ్ యాదవ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

కాగా, అమిత్ షా సవాల్ ను స్వీకరిస్తున్నట్టు అఖిలేశ్ యాదవ్ నేడు సోషల్ మీడియాలో ప్రకటించారు. యూపీలో క్రైమ్ రేటుపై చర్చించడానికి తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. నిజం మాట్లాడడానికి సన్నాహాలు అవసరంలేదని, ఏ సమయంలోనైనా చర్చకు సిద్ధమని అఖిలేశ్ ఉద్ఘాటించారు. "టైమ్, ప్లేసు చెప్పండి... చర్చకు వస్తా" అంటూ బదులిచ్చారు.

ఇటీవల అమిత్ షా యూపీలో పర్యటించిన సందర్భంగా ఓటర్లతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అఖిలేశ్ కు దమ్ముంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన నేరాల గణాంకాలను మీడియాకు వెల్లడించాలని అన్నారు.
Akhilesh Yadav
Amit Shah
Debate
Crime Rate
Uttar Pradesh
Assembly Elections
Samajwadi
BJP
India

More Telugu News