Chandrababu: ఎన్టీఆర్ పేరుతో ఉన్న పథకాలు తొలగించి.. ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటారా?: చంద్రబాబు మండిపాటు
- అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జులతో చంద్రబాబు సమావేశం
- ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా జిల్లాల పునర్విభజన
- ఏడాదిపాటు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
- ప్రజల్లో ఉండి పోరాడే వారికి సముచిత స్థానం
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాను ఏర్పాటు చేయడంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందించారు. పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్లతో చంద్రబాబు నిన్న ఆన్లైన్ ద్వారా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటు అంశం చర్చకు వచ్చింది. చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేరుతో ఉన్న 14 పథకాలను రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆయన పేరుతో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతూ గొప్పలకు పోతోందని మండిపడ్డారు.
ప్రజల నెత్తిన ఇప్పుడున్న భారం సరిపోదన్నట్టు కరెంటు చార్జీలు కూడా పెంచాలని చూడడం దారుణమన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని సమావేశంలో డిమాండ్ చేశారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా జిల్లాల పునర్విభజన జరగడం దురదృష్టకరమని అన్నారు.
ఈ ఏడాది మే 29 నుంచి వచ్చే ఏడాది మే 28వ తేదీ వరకు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించనున్నట్టు చంద్రబాబు తెలిపారు. టీడీపీ ఆవిర్భవించి ఈ ఏడాదితో నాలుగు దశాబ్దాలు పూర్తవుతుందని గుర్తు చేసిన చంద్రబాబు ఈ రెండు సందర్భాలను పార్టీ నేతలు ఘనంగా నిర్వహించాలని కోరారు.
అలాగే, ప్రజా సమస్యలు, స్థానిక సమస్యలపై ప్రజా పోరాటాలను ఉద్ధృతం చేయాలని, వైసీపీ నేతల అవినీతి, అక్రమాలపైనా పోరాడాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో ఉండి పోరాడే వారికి పార్టీ నాయకత్వం సముచిత స్థానం ఇస్తుందని చంద్రబాబు చెప్పారు.