Sajjala Ramakrishna Reddy: పీఆర్సీ సాధన సమితి నేతలతో చర్చలు ప్రారంభమయ్యాయి... ఇంకా ముందుకెళతాం: సజ్జల
- చర్చలకు రావాలని ఉద్యోగులకు నిన్న ఆహ్వానం
- చర్చలు మొదలవడం సానుకూల పరిణామమన్న సజ్జల
- సమ్మె వాయిదా వేసుకోవాలని కోరామని వెల్లడి
పీఆర్సీ సాధన సమితి నేతలతో చర్చలు ప్రారంభమయ్యాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఇది సానుకూల పరిణామం అని, చర్చల పరంగా మరింత ముందుకెళతామని అన్నారు. సమ్మె ప్రతిపాదన వాయిదా వేయాలని కోరామని సజ్జల వెల్లడించారు. ఉద్యోగుల జీతాల నుంచి రికవరీలు అనేవి ఏమీ లేవని స్పష్టం చేశారు.
ఉద్యోగ సంఘాలు వారి 3 డిమాండ్లను తమ ముందు ఉంచారని తెలిపారు. ఉద్యోగులు అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక అడిగారని వెల్లడించారు. జీవోలు రద్దు చేయడం సరైన నిర్ణయం కాదని, ఉద్యమ కార్యాచరణను నిలిపివేయాలని తాము నచ్చచెప్పే ప్రయత్నం చేశామని సజ్జల పేర్కొన్నారు. చర్చల ద్వారా సరిదిద్దుకునేవి ఉంటే పరిష్కరించుకుందామని చెప్పామని వివరించారు. మంత్రుల కమిటీతో చర్చలకు రావాలంటూ పీఆర్సీ సాధన సమితికి నిన్న ప్రభుత్వం ఆహ్వానం పంపడం తెలిసిందే.