CM KCR: కూకటివేళ్లతో పెకలించి వేస్తాం... కేంద్రంపై సీఎం కేసీఆర్ సమరభేరి
- కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ విమర్శలు
- ప్రధాని మోదీపై నిప్పులు చెరిగిన వైనం
- సంకుచిత కేంద్ర ప్రభుత్వం అంటూ వ్యాఖ్యలు
- బీజేపీని బంగాళాఖాతంలో వేయాలని పిలుపు
కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ కేంద్ర నాయకత్వంపై నిప్పులు చెరిగారు. దేశానికి కొత్త రాజ్యాంగం రాయాల్సిన అవసరం ఉందన్నారు. తమను లక్ష్యంగా చేసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, కూకటివేళ్లతో పెకలించివేస్తాం అని హెచ్చరించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మన ప్రధానికి ఏమాత్రం దూరదృష్టి లేదని, వెరీ షార్ట్ సైటెడ్ అని వ్యాఖ్యానించారు.
హైదరాబాదులో ఆర్బిట్రేషన్ సెంటర్ ను అడ్డుకునేందుకు మోదీ కుట్ర చేశారని, ఈ న్యాయ కేంద్రాన్ని అహ్మదాబాద్ కు తరలించాలని చూశారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. సంకుచితమైన కేంద్ర ప్రభుత్వం ఉన్నందుకు సిగ్గుపడుతున్నామని అన్నారు. కేంద్రం చెప్పేదంతా అబద్ధమేనని స్పష్టం చేశారు. క్రిప్టోకరెన్సీని ఎవరైనా అంగీకరిస్తారా? అని నిలదీశారు. క్రిప్టోకరెన్సీని అధికారికంగా గుర్తించకుండా 30 శాతం పన్ను ఎలా వేస్తారని అడిగారు.
కేంద్రం నిస్సిగ్గుగా ఎల్ఐసీని అమ్ముతోందని, ఎక్కడైనా నష్టాలు వస్తే అమ్ముతారని, కానీ లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. అంతర్జాతీయ బీమా కంపెనీలకు మోదీ బ్రోకర్ లా వ్యవహరిస్తున్నారా? అని మండిపడ్డారు. బ్యాంకులను ముంచినవారంతా సంతోషంగా విదేశాల్లో ఉన్నారని ఆరోపించారు. నల్లధనం తెస్తానని చెప్పి తీసుకురాలేకపోగా, బ్యాంకులను మోసగించిన గజదొంగలను దేశం దాటించారని ధ్వజమెత్తారు.
ప్రపంచ ఆహార కొరత సూచీలో భారతదేశం 101వ స్థానంలో ఉందని వ్యాఖ్యానించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ, పెట్టుబడి రెట్టింపు చేశారని ఎద్దేవా చేశారు. అందరికీ హౌసింగ్ అనేది పచ్చి బోగస్ అని విమర్శించారు. దేశంలో 15 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, అవి భర్తీ చేయకుండా సిగ్గులేకుండా తెలంగాణలో ధర్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
దేశం బాగుపడాలంటే బీజేపీని బంగాళాఖాతంలో పడేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మోదీ దేశానికి ప్రధాని కాదని, గుజరాత్ కు మాత్రమేనని అన్నారు. తెలంగాణలో ఆర్బిట్రేషన్ సెంటర్ కు పోటీగా గుజరాత్ లో గిఫ్ట్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని ఇవాళ ప్రకటించారని, తెలంగాణ కోడలు అని చెప్పుకునే నిర్మలా సీతారామన్ కు ఇది భావ్యమేనా అని ప్రశ్నించారు.
ఇక, బడ్జెట్ లో జోక్ ఆఫ్ ద మ్యాటర్ అంటే నదుల అనుసంధానమేనని, నదుల అనుసంధానం చేస్తామని ఏ అధికారంతో చెప్పారని నిలదీశారు. తాను టీవీ చానల్లో చర్చకు సిద్ధమంటూ బీజేపీ నేతలకు ఈ సందర్భంగా కేసీఆర్ సవాల్ విసిరారు.