Employees: బెజవాడ జనసంద్రం... పోటెత్తిన ఉద్యోగులు...వీడియో ఇదిగో!

Employees hugely attends Chalo Vijayawada

  • పీఆర్సీ సాధన కోసం ఉద్యోగుల నిరసనలు
  • నేడు ఛలో విజయవాడ
  • అడుగడుగునా పోలీసు ఆంక్షలు
  • అన్నింటినీ ఛేదించిన ఉద్యోగులు
  • విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో భారీ ర్యాలీ

పీఆర్సీ, ఇతర డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు ప్రకటించిన కార్యాచరణలో భాగంగా నేడు ఛలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగులు వేలాదిగా తరలివచ్చారు. పోలీసులు అడుగడుగునా ఆంక్షలు అమలు చేసే ప్రయత్నం చేసినా, ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. దాంతో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యోగులతో క్రిక్కిరిసిపోయింది.

ఉద్యోగులను విజయవాడ రాకుండా చేసేందుకు పోలీసులు నిన్నటి నుంచే పలు చర్యలకు దిగారు. అయితే ఉద్యోగులు మారువేషాల్లో పోలీసులను బోల్తా కొట్టించినట్టు తెలుస్తోంది. రైతులు, కూలీల వేషంలో ఉద్యోగులు విజయవాడ చేరుకున్నట్టు అనేక ఫొటోలు చెబుతున్నాయి. ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో ఉద్యోగులు తరలివచ్చారు. తాజా వీడియోలు చూస్తుంటే అంచనాలకు మించి ఉద్యోగులు విజయవాడ చేరుకున్నట్టు తెలుస్తోంది.

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్లు వెల్లువెత్తిన నేపథ్యంలో పోలీసులు నిస్సహాయుల్లా మారారు. వేలాదిగా ఉద్యోగులు పోటెత్తడంతో పోలీసు బలగాలు ప్రేక్షకపాత్ర వహించాయి. ఉద్యోగులను నిలువరించేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు, కంచెలు నిరుపయోగంగా మారాయి.

కాగా, బీఆర్టీఎస్ మీసాల రాజేశ్వరరావు బ్రిడ్జి నుంచి పీఆర్సీ సాధన సమితి ర్యాలీ షురూ అయింది. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఉద్యోగులు ర్యాలీలో పాల్గొనడంతో విజయవాడ హోరెత్తిపోయింది. బీఆర్టీఎస్ రోడ్డులో బహిరంగ సభకు అనుమతి లేకపోవడంతో పీఆర్సీ సాధన సమితి నేతలు ట్రాలీ ఆటో పైనుంచి ప్రసంగించారు.

  • Loading...

More Telugu News