Chandrababu: ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్ట్ చేస్తారా?: చంద్రబాబు ఆగ్రహం
- ఛలో విజయవాడ చేపట్టిన ఉద్యోగులు
- ప్రభుత్వ ఆంక్షలపై మండిపడిన చంద్రబాబు
- సర్కారు నియంతృత్వ తీరును ఖండిస్తున్నట్టు ప్రకటన
- పీఆర్సీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్
ఏపీ ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమంపై జగన్ సర్కారు నియంతృత్వ ధోరణిని ఖండిస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు.
రివర్స్ పీఆర్సీని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, నియంతృత్వం వీడి సమస్యలకు పరిష్కారం చూపాలని హితవు పలికారు. విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇది లక్షలాది ఉద్యోగులకు సంబంధించిన సమస్య అని, అహంకారంతో కాకుండా ఆలోచనతో స్పందించాలని తెలిపారు.
ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు కాదా? రాష్ట్రంలో భాగస్వాములు కాదా? అని నిలదీశారు. రాజకీయ పార్టీల నేతలను ఎలా గృహనిర్బంధాలు చేస్తున్నారో, ఉద్యోగులను కూడా అదే తరహాలో నిర్బంధిస్తుండడం జగన్ వైఖరిని స్పష్టం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. పోలీసు పహారా పెట్టి ఉపాధ్యాయులను నిర్బంధించడం అంటే విద్యార్థుల ముందు టీచర్లను అవమానించడమేనని స్పష్టం చేశారు.
మాయ మాటలతో ప్రజలను, ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్, ఇప్పుడు అంకెల గారడీ చేస్తూ జీతాలు తగ్గించలేదని మళ్లీ మోసం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఉద్యోగులను అగౌరవపరిచే, ఆత్మగౌరవం దెబ్బతీసే విధానాన్ని జగన్ ఇప్పటికైనా వీడాలని హితవు పలికారు.
రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తాము 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని గుర్తుచేశారు. కానీ జగన్ ప్రభుత్వంలా ఐఆర్ కంటే తక్కువ ఫిట్ మెంట్ ఇచ్చి జీతాలు రికవరీ చేయడం దేశంలో ఇప్పటివరకు జరగలేదని విమర్శించారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.