Narendra Modi: ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాదు రాక
- రెండు కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
- ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరు
- రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ
- 216 అడుగుల ఎత్తుతో విగ్రహం
- విగ్రహం తయారీలో 120 కిలోల బంగారం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 5న హైదరాబాదులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రెండు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పటాన్ చెరు సమీపంలోని ఇక్రిశాట్ సంస్థ గోల్డెన్ జూబిలీ ఉత్సవాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా, శ్రీ రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా విగ్రహావిష్కరణ (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) చేయనున్నారు.
ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్నజీయర్ స్వామి శ్రీ రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాలను ముచ్చింతల్ ఆశ్రమంలో ఘనంగా చేపడుతుండడం తెలిసిందే. ఇక్కడ 216 అడుగుల ఎత్తున రామానుజాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహ తయారీలో 120 కిలోల బంగారంతో పాటు వెండి, రాగి, ఇత్తడి, జింక్ కూడా ఉపయోగించారు.
కాగా, కూర్చున్న స్థితిలో ఉన్న విగ్రహాల్లో ప్రపంచంలోనే ఇది రెండో ఎత్తయినది. థాయ్ లాండ్ లోని బుద్ధ విగ్రహం ఈ కోవలో మొదటిస్థానంలో ఉంది.
రామానుజాచార్యుల విగ్రహ తయారీ కోసం రూ.1000 కోట్ల వరకు వెచ్చించినట్టు తెలుస్తోంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుంచి విరాళాలు సేకరించారు. కాగా, విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనుండగా, విగ్రహం దిగువ భాగంలో ఏర్పాటు చేసిన గదిని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభిస్తారు.