Byreddy Rajasekar Reddy: రాయలసీమను 14 జిల్లాలుగా విభజించాలంటూ బైరెడ్డి డిమాండ్
- దేశంలోని 13 రాష్ట్రాల కంటే రాయలసీమే పెద్దది
- అనంతపురం, కర్నూలు జిల్లాలను నాలుగేసి జిల్లాలుగా చేయండి
- కడప, చిత్తూరు జిల్లాలను మూడేసి జిల్లాలుగా చేయండి
జిల్లాల పునర్విభజన అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. కొత్త జిల్లాల డిమాండ్లు, జిల్లా కేంద్రాల కోసం డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా రాయలసీమ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు చాలా పెద్దవిగా ఉంటాయని... అందువల్ల సీమను 14 జిల్లాలుగా విభజించాలని డిమాండ్ చేశారు. దేశంలోని 13 రాష్ట్రాల వైశాల్యం కంటే రాయలసీమే పెద్దగా ఉంటుందని అన్నారు.
అనంతపురం, కర్నూలు జిల్లాలను ఒక్కో జిల్లాను నాలుగు జిల్లాలుగా చేయాలని... కడప, చిత్తూరు జిల్లాలను ఒక్కో జిల్లాను మూడు జిల్లాలుగా విడగొట్టాలని బైరెడ్డి సూచించారు. కర్నూలు జిల్లాలోని ఆదోనిని, చిత్తూరు జిల్లాలోని మదనపల్లెను జిల్లాలుగా చేయాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయని బైరెడ్డి చెప్పారు. జగన్ తుగ్లకా, జగ్లకా అనే విషయం తనకు అర్థం కావడం లేదని అన్నారు.