USA: సిరియాలో మరో భారీ టార్గెట్ ఛేదించిన అమెరికా దళాలు... ఐసిస్ కీలకనేత హతం
- అబు ఇబ్రహీం అల్ హషీమీ మృతి
- వాయవ్య సిరియాలో ఆపరేషన్
- గురి తప్పని అమెరికా కమాండోలు
- కీలక సమాచారంతో దాడి
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థను కూకటివేళ్లతో సహా పెకలించి వేయాలని కంకణం కట్టుకున్న అగ్రరాజ్యం అమెరికా ఆ దిశగా మరో విజయం సాధించింది. ఐసిస్ కీలక నేత అబు ఇబ్రహీం అల్ హషీమీ అమెరికా దళాల దాడిలో హతుడయ్యాడు.
ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ప్రకటన చేశారు. వాయవ్య సిరియాలో జరిగిన దాడిలో అమెరికా ప్రత్యేక దళాలు హషీమీని మట్టుబెట్టాయని బైడెన్ వెల్లడించారు. 2019లో ఐసిస్ అగ్రనేత అబు బకర్ అల్ బాగ్దాదీని తుదముట్టించిన తర్వాత, సిరియాలో అమెరికా చేపట్టిన రెండో అతిపెద్ద ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ఇదే.
దీనిపై బైడెన్ స్పందిస్తూ "గతరాత్రి నా ఆదేశాల ప్రకారం అమెరికా ప్రత్యేక దళాలు వాయవ్య సిరియాలో ఓ కౌంటర్ టెర్రరిజమ్ ఆపరేషన్ చేపట్టాయి. అమెరికా పౌరులను, మిత్రదేశాలను కాపాడుకోవడానికి ఈ చర్య తప్పనిసరి అయింది. ఈ ప్రపంచాన్ని సురక్షితమైన ప్రదేశంగా ఉంచడానికి ఇలాంటి దాడులు అవసరమే. ఈ దాడిలో అత్యున్నత నైపుణ్యం, తెగువ ప్రదర్శించిన మా బలగాలకు కృతజ్ఞతాభినందనలు. ఈ దాడిలో అబు ఇబ్రహీం అల్ హషీమీ అల్ ఖురేషీ మరణించాడు" అంటూ బైడెన్ పేర్కొన్నారు. ఈ దాడిలో పాల్గొన్న అమెరికా కమాండోలు అందరూ సురక్షితంగా తమ స్థావరాలకు తిరిగొచ్చారని బైడెన్ వెల్లడించారు.
పెంటగాన్ మీడియా కార్యదర్శి జాన్ కిర్బీ స్పందిస్తూ, మధ్య ప్రాచ్యంలో సైనిక కార్యకలాపాలు, ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించే అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ దాడి నిర్వహించిందని కిర్బీ తెలిపారు.
కాగా, ఇతర వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం... సిరియా-టర్కీ సరిహద్దు ప్రాంతంలోని అట్మే వద్ద ఓ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా కమాండోలు దాడి చేశారు. ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చిన తరహాలోనే, అర్ధరాత్రి వేళ హెలికాప్టర్ ద్వారా కమాండోలు కిందికి దిగారు. కొన్ని నిమిషాల్లోనే పలు పేలుళ్లు, కాల్పులతో ఆ భవనం పాక్షికంగా దెబ్బతింది. ఈ దాడిలో 13 మంది మరణించినట్టు తెలుస్తోంది.
పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం... మూడు హెలికాప్టర్లు ఈ ఆపరేషన్ లో పాలుపంచుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఆ భవనంలోని సాయుధులు కూడా అమెరికా హెలికాప్టర్లపై మెషీన్ గన్లతో గుళ్లవర్షం కురిపించినట్టు ప్రత్యక్షసాక్షి వెల్లడించారు. డ్రోన్ దాడుల తరహాలో శబ్దాలు వినిపించాయని కూడా తెలిపారు.