Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పుల నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసుల అప్రమత్తం
- ముఖ్యంగా పాతబస్తీలో భద్రత కట్టుదిట్టం
- క్విక్ రియాక్షన్ టీం, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ మోహరింపు
- శుక్రవారం ప్రార్థనల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు
- రేపు హైదరాబాద్‌లో మోదీ పర్యటన నేపథ్యంలో మరిన్ని చర్యలు
నిన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా రహదారిపై ఒక టోల్ ప్లాజా వద్ద తన కారుపై కాల్పులు జరిపారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపిన విషయం తెలిసిందే. ఆయన కారుపై నాలుగు రౌండ్ల ఫైరింగ్ జరగడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా పాతబస్తీలో భద్రతను కట్టుదిట్టం చేసి పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
క్విక్ రియాక్షన్ టీం, రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను ఈ రోజు ఉదయం నుంచి ఏర్పాటు చేశారు. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నారు. ఒవైసీపై కాల్పుల ఘటన గురించి సామాజిక మాధ్యమాల్లో పలు పోస్టులు రావడంతో ఐఎం నేతలు, కార్యకర్తలు, అభిమానుల దారుస్సలాంకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
ఇదిలావుంచితే, ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హైదరాబాద్ పర్యటనకు వస్తుండడంతో దాదాపు ఏడు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.