Journalist: బిడ్డను ఎత్తుకుని లైవ్ లో వాతావరణ వివరాలు చెప్పిన జర్నలిస్ట్.. ఇదిగో వీడియో!
- అమెరికా సీబీఎస్ లో పనిచేస్తున్న రెబెక్కా షూల్డ్
- పాప నిద్ర నుంచి లేవడంతో ఎత్తుకుని డ్యూటీ చేసిన వైనం
- మిగతా తల్లులకూ ప్రేరణ అని కామెంట్
కరోనా మహమ్మారి ఎందరో జీవితాలను ప్రభావితం చేసేసింది. ప్రత్యేకించి జాబ్ చేసే తల్లులకు ఒకింత సవాల్ తో కూడుకున్నదే. ఇప్పటికీ చాలా మంది ఇంటి నుంచే పనిచేయాల్సిన పరిస్థితి. అయితే, అమెరికాలో వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్న ఓ జర్నలిస్ట్ ఊహించని అతిథిని అందరికీ పరిచయం చేసి అందరి మొహాల్లో చిరునవ్వులు వచ్చేలా చేశారు.
తన 3 నెలల బిడ్డను ఎత్తుకుని వాతావరణ వివరాలను చదివి వినిపించారు. విస్కాన్సిన్స్ లోని మిల్వాకీకి చెందిన రెబెక్కా షూల్డ్ (42) సీబీఎస్ న్యూస్ లో పనిచేస్తున్నారు. అయితే, సరిగ్గా తన డ్యూటీ టైంకు పాప నిద్ర నుంచి లేవడంతో.. పాపను ఎత్తుకుని ఆమె తన డ్యూటీ చేశారు. ‘‘గాఢమైన నిద్రలో ఉన్న నా బిడ్డ అప్పుడే లేచింది. ఏం చేయాలో తోచలేదు. వెంటనే మా పాపను తీసుకుని వెళ్లిపోయా. బిడ్డను తీసుకొచ్చేసరికి కార్యక్రమ ప్రొడ్యూసర్ ఆశ్చర్యపోయారు. పాపను పరిచయం చేస్తున్నావా ఏంటి? అంటూ అడిగారు. చాలా సేపు పడుకుని లేచిందిగా.. ఇబ్బంది పెట్టదులే అని ఆమెకు చెప్పాను. ఆ తర్వాత వెదర్ ఫోర్ కాస్ట్ సక్సెస్ అయింది’’ అని రెబెక్కా తెలిపారు.
ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోకు వచ్చిన రెస్పాన్స్ చూసి రెబెక్కా కూడా తెగ సంబరపడ్డారు. ‘‘ఎంతో గౌరవంగా ఉంది. ఎంతోమంది, ఎన్నో వార్తా సంస్థలు దీనిని ప్రసారం చేయడం చూసి షాక్ కు గురయ్యా. ఎన్నో సవాళ్లతో కూడిన ఈ ప్రపంచానికి కాస్తంత ఆనందాన్నిచ్చిన అనుభూతి కలుగుతోంది’’ అని ఆమె పేర్కొన్నారు.
తాను తీసుకున్న ఆ నిర్ణయం చాలా మంది తల్లులకూ ప్రేరణగా నిలుస్తుందన్న ఆశ ఉందని ఆమె చెప్పారు. తనకు ఎందరో ఫోన్లు చేస్తున్నారని, మెసేజ్ లు పంపుతున్నారని, తానెప్పుడు వాతావరణ వార్తలు చదివినా తన కూతురును తీసుకొని రావాలని అడుగుతున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు.