Nara Lokesh: జీలుగ కల్లు మృతుల అంశంలో సీఎం జగన్ పై ధ్వజమెత్తిన లోకేశ్
- తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
- జీలుగ కల్లు తాగి ఐదుగురు గిరిజనుల మృతి
- నష్ట పరిహారం చెల్లించాలన్న లోకేశ్
- టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను విడుదల చేయాలని డిమాండ్
తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఐదుగురు గిరిజనులు జీలుగ కల్లు తాగి మరణించడం తెలిసిందే. ఈ అంశంలో టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రాణాంతక మద్యం అత్యధిక ధరకు కొని తాగలేని గిరిజనులు కల్తీ కల్లు తాగి చనిపోతే కేసు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. లోదొడ్డి గ్రామానికి టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వెళితే పోలీసులు అరెస్ట్ చేశారని, కానీ వైసీపీ నేతలను ఎలా పంపించారు? అంటూ ప్రశ్నించారు. సర్కారు తప్పులేకపోతే ఎందుకు ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నారు? అని నిలదీశారు.
"జగన్ గారూ, మీ ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి రాష్ట్రం మీ అక్రమాస్తుల పుత్రిక సాక్షి కార్యాలయం కాదు.. ప్రజాస్వామ్య వ్యవస్థ" అని హితవు పలికారు. గిరిజనుల మరణాలపై న్యాయవిచారణ జరిపించాలని, ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన టీడీపీ నిజనిర్ధారణ బృందాన్ని వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు.