Andhra Pradesh: పీఆర్సీ విషయంలో అన్నింటికీ పరిష్కారం చూపించాం.. ఇక మిగిలినవి చిన్న చిన్న సమస్యలే!: ఉద్యోగులతో చర్చలపై మంత్రి బొత్స
- పీఆర్సీపై ఆర్థిక శాఖ అధికారులతో మంత్రుల కమిటీ భేటీ
- ఇవాళ మరోసారి ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు
- హెచ్ఆర్ఏ శ్లాబులపై చర్చిస్తామన్న బొత్స
ఆర్థిక శాఖ అధికారులతో మంత్రుల కమిటీ మరోసారి భేటీ అయింది. ఇవాళ పీఆర్సీ సాధన సమితి నేతలతో మరోసారి చర్చలకు వెళ్లనున్న నేపథ్యంలో మంత్రుల కమిటీ తాడేపల్లి పార్టీ కార్యాలయంలో అధికారులతో సమావేశమైంది. భేటీకి ముందు మంత్రి బొత్స సత్యానారాయణ మీడియాతో మాట్లాడారు.
‘‘పీఆర్సీ గురించి నిన్న అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఉద్యోగులతో చర్చించాం. వారి సమస్యలు, అసంతృప్తి, ఆవేదనకు పరిష్కారం చూపించాం. ఐఆర్ రికవరీ విషయంలో స్పష్టతనిచ్చాం. ఇవాళ మళ్లీ ఉద్యోగులతో సమావేశమై హెచ్ఆర్ఏ శ్లాబుల గురించి చర్చిస్తాం. దీనివల్ల ప్రభుత్వంపై రూ.6వేల కోట్ల భారం పడే అవకాశం ఉంది. మిగతా సమస్యలన్నీ చిన్నచిన్నవే ఉన్నాయి. చర్చల తర్వాత సీఎం జగన్ కు అన్ని విషయాలూ చెప్తాం’’ అని బొత్స తెలిపారు.
కాగా, నిన్న అర్ధరాత్రి వరకు ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ఐఆర్ రికవరీ చేయబోమని, ఐదేళ్లకోసారి పీఆర్సీ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.