Lata Mangeshkar: లత మంగేష్కర్ మరణానికి సంతాపంగా.. రెండు రోజులు త్రివర్ణం అవనతం
- ఇవాళ, రేపు దేశవ్యాప్తంగా అమలు
- ఇప్పటికే సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
- ఇవాళ 6.30 గంటలకు ఆమె అంత్యక్రియలు
లతా మంగేష్కర్ మరణానికి సంతాపంగా జాతీయ పతాకాన్ని రెండు రోజుల పాటు అవనతం చేయనున్నారు. ఈ మేరకు ఇవాళ, రేపు త్రివర్ణ పతాకాన్ని దేశవ్యాప్తంగా సగం ఎత్తులోనే ఎగరేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికారులు చెప్పారు. కాగా, ఇప్పటికే ఈ రెండు రోజులను సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
కరోనా సోకి జనవరి 8న ఆసుపత్రిలో చేరిన భారతరత్న లతా మంగేష్కర్.. ఇవాళ ఉదయం 8.12 గంటలకు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజుల పాటు ఆమె బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్నారు. కరోనా తగ్గిపోయినా దాని వల్ల వచ్చిన సమస్యలతో ఆమె ప్రాణాలు విడిచారని ఆసుపత్రి సీఈవో ఎన్. సంతానం తెలిపారు.
కాగా, మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ వల్ల ఆమె చనిపోయారని ఇన్నాళ్లూ ఆమెకు చికిత్స చేసిన డాక్టర్ ప్రతీత్ సందానీ వెల్లడించారు. ఆమె పార్థివదేహాన్ని ఆమె నివాసం ప్రభు కుంజ్ కు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు శివాజీ పార్క్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.