LIC: రద్దయిన పాలసీల పునరుద్ధరణకు ఎల్ఐసీ ప్రత్యేక ఆఫర్
- ఈ నెల 7 నుంచి మార్చి 25 వరకు
- పునరుద్ధరణకు ప్రత్యేక కార్యక్రమం
- ఆలస్యపు రుసుముల్లో రాయితీలు
జీవిత బీమా దిగ్గజ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తన పాలసీదారులకు మరో విడత పునరుద్ధరణ అవకాశాన్ని తీసుకొచ్చింది. ప్రత్యేక పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఈ నెల 7 (సోమవారం) నుంచి మార్చి 25 వరకు నిర్వహిస్తున్నట్టు ఎల్ఐసీ ప్రకటించింది.
ప్రీమియం చెల్లించని పాలసీలు నిర్ణీత వ్యవధి తర్వాత రద్దవుతాయి. వీటినే ల్యాప్స్ డ్ పాలసీలుగా చెబుతారు. పలు కారణాలతో పాలసీదారులు ప్రీమియం చెల్లించలేకపోవచ్చు. వాటిని కొనసాగించుకునేందుకు ఇప్పుడు మరొక అవకాశం వచ్చింది. ‘‘మరణానికి రక్షణ అవసరాన్ని కరోనా మహమ్మారి మరోసారి గుర్తు చేసింది. పాలసీదారులు పునరుద్ధరణ అవకాశాన్ని వినియోగించుకోవాలి. తద్వారా వారి కుటుంబాల ఆర్థిక రక్షణకు భరోసా ఉండేలా చూసుకోవాలి’’ అని ఎల్ఐసీ సూచించింది.
ప్రీమియం ఆలస్యంగా చెల్లిస్తారు కనుక ఆలస్యపు రుసుమును ఎల్ఐసీ వసూలు చేయనుంది. టర్మ్ ప్లాన్లు మినహా మిగిలిన ప్లాన్ల పునరుద్ధరణపై ఆలస్యపు రుసుముల్లో 20-30 శాతం తగ్గింపును ఇస్తున్నట్టు తెలియజేసింది.