PRC: ఉద్యోగులను నిండా ముంచారు.. ఆశలు అడియాసలయ్యాయి: ఎమ్మెల్సీలు ఐవీఆర్, షేక్ సాబ్జీ
- ప్రభుత్వం విజయం సాధించింది
- ఉద్యోగులకు పెను నష్టం సంభవించింది
- మంత్రుల సబ్ కమిటీ పేరుతో పెద్ద నాటకమే నడిచింది
- ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామన్న ఎమ్మెల్సీలు
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ద్వారా ఉద్యోగులకు జరిగిన నష్టం ఎన్ని పీఆర్సీలు ఇచ్చినా రికవరీ కాదని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అన్నారు. చర్చల పేరుతో ఉద్యోగుల సమ్మెను విరమించేలా చేసి ప్రభుత్వం పై చేయి సాధించిందని, ఉద్యోగుల ఆశలు మాత్రం అడియాసలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రుల సబ్ కమిటీ పేరుతో ఈ విషయంలో పెద్ద నాటకమే నడించిందని, ప్రభుత్వానికి మేలు జరిగింది కానీ, ఉద్యోగులకు మాత్రం పెను నష్టం సంభవించిందని అన్నారు.
23 శాతం పీఆర్సీలో మార్పు కోసం మంత్రుల కమిటీ అంగీకరించకపోవడం అప్రజాస్వామికమని విమర్శించారు. 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్లు తీవ్ర అసంతృప్తికి గురయ్యారని అన్నారు. పీఆర్సీ కథను కంచికి చేర్చిన ఘనత నాయకులకే దక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉద్యమానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.