ramcharan rao: కేసీఆర్‌పై దేశద్రోహం కేసు వేయాలని నిర్ణయించాం: బీజేపీ నేత రాంచందర్‌రావు
- కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కోర్టుల్లో ప్రైవేట్ కేసులు వేస్తాం
- రోజుకో గంట పాటు కోర్టుల ముందు నిరసన
- మోదీ, నిర్మలా సీతారామన్ పై కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదు
- రాజకీయ దురుద్దేశంతోనే రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్నారన్న రాంచందర్‌రావు
బీజేపీ లీగల్‌సెల్ ప్రతినిధులతో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికావని చెప్పారు.
కేసీఆర్‌పై దేశద్రోహం కేసు వేయాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అలాగే, రోజుకో గంట పాటు కోర్టుల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు బీజేపీ నేతలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. దేశ రాజ్యాంగానికి సంకెళ్లు వేయాలని టీఆర్ఎస్ భావిస్తోందని ఆయన చెప్పారు.
ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరసనలో పాల్గొంటే ఆందోళనకారులపై నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. మోదీని, నిర్మలా సీతారామన్‌ను వ్యక్తిగతంగా అవమానించేలా కేసీఆర్ మాట్లాడటం దుర్మార్గమని ఆయన చెప్పారు. కేసీఆర్ రాజకీయ దురుద్దేశంతోనే రాజ్యాంగాన్ని తిరిగి రాయాలాంటూ అంబేద్కర్‌ను అవమానించారని ఆయన అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై కోర్టుల్లో ప్రైవేటు కేసులు వేస్తామని చెప్పారు.