Mumbaiౌ: ప్రపంచంలో రద్దీ నగరాల్లో ముంబై, బెంగళూరు
- టామ్ టామ్ ఇండెక్స్ 2021 నివేదిక
- ఢిల్లీ, పుణేలకూ చోటు
- 2019 నాటితో పోలిస్తే రద్దీ తక్కువే
ప్రపంచవ్యాప్తంగా రద్దీ ఎక్కువగా ఉన్న నగరాల్లో ముంబై, బెంగళూరు, ఢిల్లీ, పుణే నగరాలకు స్థానం లభించింది. టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2021 నివేదిక ప్రకారం.. ముంబై 5వ ర్యాంకు. బెంగళూరు 10వ ర్యాంకు, ఢిల్లీ 11వ ర్యాంకు, పుణే 21వ ర్యాంకు సంపాదించాయి.
భారత్ లోని ఈ నాలుగు నగరాల్లో 2021లో వాహన రద్దీ.. కరోనా ముందు నాటి కంటే (2019) 23 శాతం తక్కువగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. టామ్ టామ్ ఇండెక్స్ 2020లోనూ ముంబై, బెంగళూరు, ఢిల్లీ టాప్ -10 ర్యాంకుల్లో ఉండడం గమనార్హం. నాటి జాబితాలో ముంబై 2, బెంగళూరు 6, ఢిల్లీ 8 ర్యాంకుల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 58 దేశాల్లోని 404 పట్టణాల్లో రద్దీ గణాంకాల ఆధారంగా ఏటా టామ్ టామ్ ఈ నివేదికను విడుదల చేస్తుంటుంది.
404 నగరాలకు గాను 70 నగరాల్లో వాహన రద్దీ 2019 ముందు నాటిని అధిగమించింది. దీని ఆధారంగా ట్రాఫిక్ సాధారణ స్థితికి వచ్చేసినట్టు తెలుస్తోందని నివేదిక పేర్కొంది. 2021 జాబితాలో అత్యంత రద్దీ నగరంగా ఇస్తాంబుల్ మొదటి ర్యాంకులో నిలిచింది. మాస్కో రెండో స్థానంలో ఉంది.