Pawan Kalyan: మీ వైఫల్యానికి విపక్షాలను నిందించడం ఎంతవరకు సబబు?: వైసీపీ సర్కారుపై పవన్ కల్యాణ్ విమర్శలు
- జనసేన సోషల్ మీడియాకు పవన్ ఇంటర్వ్యూ
- ఉద్యోగుల సమస్య తాము సృష్టించింది కాదన్న పవన్
- వైసీపీ ప్రభుత్వ వైఫల్యమేనని కామెంట్
- ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపణ
ఉద్యోగుల సమస్య తాము సృష్టించింది కాదని, ఇతర విపక్షాలు సృష్టించిందీ కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేన సోషల్ మీడియా టీమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ పలు అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన వారం రోజుల్లోగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, జీతాలు పెంచుతామని ఉద్యోగులకు చాలా ఆశలు కల్పించారని ఆరోపించారు. ఉద్యోగుల డిమాండ్లు న్యాయబద్ధమైనవేనని, వేతన సవరణను అమలు చేయమని అడుగుతున్నారని తెలిపారు.
ఉద్యోగులకు కడుపుమండి లక్షలాది మంది రోడ్లపైకి వస్తే, దానికి జనసేనను, ఇతర పార్టీలను నిందించడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. ఏంచేసినా సరే డూడూ బసవన్నలా తలూపుతూ వెళ్లాలని వైసీపీ నేతలు భావిస్తున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. వైసీపీ మంత్రివర్గంలో ప్రతి ఒక్కరూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, మీరు ఇచ్చిన హామీలు తప్పినందువల్లే ఉద్యోగులు ఆందోళనలు తెలుపుతున్నారని పవన్ వ్యాఖ్యానించారు. అంతేతప్ప వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలకు తమను దూషించడం వల్ల ప్రయోజనమేమీ ఉండదని, వైసీపీ నేతలు వెటకారాలు ఆపి పని చూడాలని హితవు పలికారు.
ఈ సందర్భంగా, ఏపీ సీఎం జగన్ తనను ఉద్దేశించి దత్తపుత్రుడు అని వ్యాఖ్యానించడంపైనా పవన్ స్పందించారు. వైసీపీ నేతలు చేస్తున్న చాలా వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని, తాను ప్రజలకే దత్తపుత్రుడ్ని అని స్పష్టం చేశారు.