Vijayashanti: ఇలా చేస్తే ఏ ప్రభుత్వానికీ పుట్టగతులుండవు.. ఈ ఉద్యోగులే నీ భరతం పడతారు: కేసీఆర్‌పై విజయశాంతి విమర్శలు
- స్పౌజ్ (ఉద్యోగ దంపతులు)ల బదిలీల్లో అవకతవకలు
- ఉద్యోగులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు
- స్పౌజ్ బదిలీలపై సర్కారు పెద్దలు కుంటి సాకులు చెప్పారు
- కేసీఆర్.. వెంటనే ఆ బదిలీలను వెనక్కి తీసుకోవాలన్న విజయశాంతి
స్పౌజ్ (ఉద్యోగ దంపతులు)ల బదిలీల విషయంలో తెలంగాణ సర్కారు వ్యవహరిస్తోన్న తీరు బాగోలేదంటూ బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ తంతు కోసం భారీగా సొమ్ములు చేతులు మారాయంటూ ఆమె ఆరోపణలు గుప్పించారు.
''కేసీఆర్ సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా స్పౌజ్ బదిలీలు చేస్తూ... ఉద్యోగులను మానసిక క్షోభకు గురి చేస్తోంది. రాష్ట్రంలో 13 జిల్లాల్లో ‘స్పౌజ్’ బదిలీలు చేపట్టాలని ఉద్యోగులు అడుగుతుంటే... ఆయా జిల్లాల్లో పోస్టులు లేవని... కొత్తగా వేరే ఎవరైనా వస్తే కేడర్ స్ట్రెంత్ డిస్టర్బ్ అవుతుందని, భవిష్యత్తులో నిరుద్యోగులకు ఇబ్బందని అంటున్నారు. నిన్నటి దాకా స్పౌజ్ బదిలీలపై సర్కారు పెద్దలు కుంటి సాకులు చెప్పి... లోలోపల మాత్రం బ్లాక్ చేసిన జిల్లాల్లో టీచర్ల స్పౌజ్ బదిలీలు కానిచ్చేశారు.
ఈ ఎవ్వారమంతా సీఎస్, ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆఫీసర్ల కనుసన్నలలో జరిగింది. చివరికి ఈ విషయం సంబంధిత మంత్రికి, ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు కూడా సమాచారం ఇవ్వకుండా కానిచ్చేశారు. రెండు రోజుల కిందట నేరుగా సెక్రటేరియట్ నుంచి 13 జిల్లాల కలెక్టర్లకు సుమారు 400 మందికి సంబంధించిన స్పౌజ్ ఆర్డర్లు వాట్సాప్ ద్వారా పంపిస్తే వీటిని కలెక్టర్లు సోమవారం డీఈవోలకు పంపించగా... వారంతా అదే రోజు ఆ టీచర్లకు గుట్టు చప్పుడు కాకుండా పోస్టింగ్స్ ఇచ్చేశారు
ఈ తంతు కోసం భారీగా సొమ్ములు చేతులు మారాయి. దీనిపై టీచర్ల సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నా.. కేసీఆర్ సర్కార్ మొద్దు నిద్రపోతోంది. ట్రాన్స్ఫర్లపై వచ్చిన టీచర్ల వివరాలను డీఈవోలు ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలి.
కానీ వివరాలన్నీ ఫైనాన్స్ వారికి పంపించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో డీఈవోలు పంపించిండ్రు. ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ వాళ్లే వీటిని అప్లోడ్ చేసిండ్రు. ఇంత గుట్టుగా ఎందుకు చేశారనే దానిపై ఎవ్వరికీ స్పష్టత లేదు. చివరికి సంబంధిత మంత్రికీ విషయం తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. ఈ విషయమై ఆరా తీసేందుకు సీఎస్‌కు మంత్రి కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదట.
కేసీఆర్ సర్కార్‌లో మంత్రి పేరుకు మాత్రమే... ఏదైనా సమాచారమివ్వాల్సి వస్తేనే అధికారులు డీఈవోలకు కమ్యూనికేట్ ఫైల్ పెడతారు. అలాంటిది కేడర్ స్ట్రెంత్ మార్పు విషయంలో ఎలాంటి ఫైల్స్ వెళ్లకపోవడంపై అధికారుల్లోనూ అయోమయం నెలకొంది.
గతంలో 19 జిల్లాల్లో జరిగిన స్పౌజ్ బదిలీల ద్వారా 876 మంది, ఆ తర్వాత రివర్స్ స్పౌజ్ ద్వారా మరో 50 మంది బదిలీలు చేశారు. ఈ వివరాలు ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కి కూడా తెలీదు. కేసీఆర్.. వెంటనే ఆ బదిలీలను వెనక్కి తీసుకోవాలి. ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వానికీ పుట్టగతులుండవు. ఈ ఉద్యోగులే నీ భరతం పడుతారు'' అని విజయశాంతి ట్వీట్లు చేశారు.