TRS: పార్లమెంటును కించపరిచారంటూ.. ప్రధాని మోదీపై టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు సభా హక్కుల తీర్మానం
- ఏపీ పునర్విభజన బిల్లుపై మోదీ వ్యాఖ్యలు
- ప్రిసైడింగ్ ఆఫీసర్ నిర్ణయాన్ని ప్రశ్నించారన్న కేకే
- రూల్ బుక్ ప్రకారం ప్రిసైడింగ్ ఆఫీసర్ నిర్ణయమే ఫైనల్
- వారిని ప్రశ్నించడం సభను అగౌరవపరచడమే
సభ గౌరవాన్ని కించపరిచారని ఆరోపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు సభా హక్కుల తీర్మానాన్ని (ప్రివిలేజ్ మోషన్) ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా గత మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ విభజనపై అభ్యంతరకరంగా మాట్లాడారని ఆయన ఆరోపించారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఏపీ పునర్విభజన బిల్లును అత్యంత నీతిమాలిన పద్ధతిలో పాస్ చేశారంటూ ప్రధాని వ్యాఖ్యానించారని ఆరోపించారు.
పార్లమెంట్ గౌరవాన్ని, సభ నిర్వహణ తీరును దెబ్బతీసేలా అత్యంత దారుణంగా ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఎంపీలు, ప్రిసైడింగ్ ఆఫీసర్లపై ప్రధాని అపవాదుమోపే ప్రయత్నం చేశారన్నారు. సభలో క్రమశిక్షణ పోకుండా, కొందరు సభ్యుల గందరగోళాన్ని నివారించేలా ఉండేందుకే ప్రిసైడింగ్ ఆఫీసర్ పార్లమెంట్ హాలు డోర్లు మూస్తారని, దాన్ని కూడా ప్రశ్నించడం ఏంటని నిలదీశారు.
ఏపీ పునర్విభజన బిల్లుపై ఉభయ సభల్లో 2014 ఫిబ్రవరి 20న జరిగిన మూజువాణి ఓటింగ్ సందర్భంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ల నిర్ణయాన్ని, సభ నిర్వహణనే నేరుగా ప్రధాని ప్రశ్నించారని కేశవరావు ఆరోపించారు. రూల్ బుక్ ప్రకారం ప్రిసైడింగ్ ఆఫీసర్లే పవిత్రమైన ఈ ప్రజాస్వామ్య దేవాలయాన్ని (ఉభయసభలు) నడుపుతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, వారి నిర్ణయమే ఫైనల్ అని పేర్కొన్నారు.
అలాంటి వారి నిర్ణయాన్ని ప్రశ్నించడమంటే సభా ధిక్కరణేనని, సభను అగౌరవపరచడమేనని ఆయన తీర్మానంలో ఆరోపించారు. కాబట్టి ఏపీ విభజనపై వ్యాఖ్యల సందర్భంగా సభను ప్రధాని మోదీ కించపరిచారని తాము భావించి సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఆయన తెలిపారు. కాగా, కేశవరావు ప్రవేశపెట్టిన సభా హక్కుల తీర్మానానికి మద్దతిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు సంతకాలు చేశారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు నిరసనగా రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు వెల్ లోకి వెళ్లి నిరసన తెలియజేశారు.