Seediri Appalaraju: మంత్రి సీదిరి అప్పలరాజు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే: ఏపీ పోలీసు అధికారుల సంఘం
- సీఎం విశాఖ పర్యటన సందర్భంగా మంత్రి చిందులు
- ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన పోలీసు అధికారుల సంఘం
- విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని సీఎంకు విన్నపం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ పర్యటన సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు వ్యవహరించిన తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రొటోకాల్‌లో భాగంగా అడ్డుకున్న సీఐపై మంత్రి అప్పలరాజు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం స్పందించింది. పోలీసు అధికారిని దుర్భాషలాడి, దౌర్జన్యానికి పాల్పడిన మంత్రి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు, కోశాధికారి ఎం.సోమశేఖరెడ్డి తదితరులు డిమాండ్ చేశారు.
ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. దీనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ను కోరారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై మంత్రి వ్యవహరించిన తీరుపై మనస్తాపం చెందిన విశాఖపట్టణానికి చెందిన ఓ మహిళా ఎస్సై ‘పోలీసులంటే అంత లోకువా సార్’ అంటూ సోషల్ మీడియాలో విడుదల చేసిన వాయిస్ రికార్డ్ వైరల్ అవుతోంది.