Nadendla Manohar: సీఎం జగన్ కేవలం హీరోలతోనే చర్చలు జరుపుతారా?: జనసేన
- సమస్యను తనకు తానుగా సృష్టిస్తోన్న జగన్
- జగన్ వద్దకు వచ్చి బతిమిలాడాల్సిందేనా?
- చర్చలకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను ఎందుకు పిలవలేదు?
- మరి అమరావతి రైతులను ఎందుకు పిలిపించుకుని మాట్లాడట్లేదు? అని నాదెండ్ల ప్రశ్నలు
టాలీవుడ్ హీరోలు చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్తో పాటు పలువురు సినీ ప్రముఖులతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ నిన్న సమావేశమై సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించిన విషయం తెలిసిందే. దీనిపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సమస్యను తనకు తానుగా సృష్టిస్తోన్న వైఎస్ జగన్.. అందరూ తన వద్దకు వచ్చి బతిమిలాడాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. చర్చలకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు.
సీఎం జగన్ కేవలం హీరోలతోనే చర్చలు జరుపుతారా? అని నాదెండ్ల మనోహర్ నిలదీశారు. 'హడావుడిగా హీరోలను పిలిచి మాట్లాడారు. విశాఖకు సినీ పరిశ్రమ రావాలని చెప్పారు. మరి అమరావతి రైతులను ఎందుకు పిలిపించుకుని మాట్లాడడం లేదు?' అని ఆయన నిలదీశారు. మహారాజులాగా కూర్చొని, పబ్లిసిటీ కోసం ఇటువంటి చర్యలకు జగన్ పాల్పడుతున్నారని అన్నారు. తన వద్దకు వచ్చి మాట్లాడితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న విషయాన్ని చెప్పడానికే జగన్ హీరోలతో చర్చించారని ఆయన చెప్పారు.