Revanth Reddy: జనగామ ప్రసంగం తర్వాత సీఎం కేసీఆర్ ఖేల్ ఖతమ్ అన్న సంగతి స్పష్టమైంది: రేవంత్ రెడ్డి
- మోదీ 'రాష్ట్ర విభజన వ్యాఖ్యల' ప్రస్తావన చేయని కేసీఆర్
- మండిపడిన రేవంత్ రెడ్డి
- మోదీ అంటే అంత భయమెందుకని వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ జనగామలో కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. అయితే తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించిన ప్రధాని మోదీపై ఎందుకు విరుచుకుపడలేదని సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీని నిలదీయడానికి కేసీఆర్ కు అంత భయమెందుకు? అని ప్రశ్నించారు. జనగామలో ప్రసంగం విన్న తర్వాత కేసీఆర్ ఖేల్ ఖతమ్ అన్న సంగతి స్పష్టమైందని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
తెలంగాణను అమరవీరుల త్యాగాలతో సాధించుకున్నారని, అలాంటి తెలంగాణను ఎవరైనా అవమానిస్తుంటే అసలు సిసలైన తెలంగాణ బిడ్డ ఎవరైనా పౌరుషం ప్రదర్శిస్తారని, కానీ కేసీఆర్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారని విమర్శించారు. ఇవాళ జనగామలో సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీని, బీజేపీని విమర్శించినా... మోదీ చేసిన రాష్ట్ర విభజన వ్యాఖ్యల ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు.