Ram Gopal Varma: జగన్ చుట్టూ ఈ స్టార్ హీరోలంతా జూనియర్ ఆర్టిస్టుల్లా కూర్చున్నారు: రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లు
- జగన్ ను కీర్తిస్తూ బెగ్గింగ్ రీల్ స్టార్స్ ట్వీట్లు చేశారు
- జగన్, పేర్ని నాని ఈ భేటీ గురించి ఒక్క ట్వీట్ కూడా చేయలేదు
- స్టార్లంతా జగన్ ను జూనియర్ ఆర్టిస్టుల్లా అడుక్కున్నారు
ముఖ్యమంత్రి జగన్ తో భేటీ సందర్భంగా టాలీవుడ్ స్టార్లు చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్ లు వ్యవహరించిన తీరుపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్లు కొనసాగుతూనే ఉన్నాయి. సామాన్య ప్రజల్లో భాగమైన జగన్, పేర్ని నానిలు సూపర్, మెగా, బాహుబలి స్టార్ల కంటే పెద్ద స్టార్లుగా కనిపిస్తున్నారని ఆయన అన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రిని కీర్తిస్తూ ఈ బెగ్గింగ్ రీల్ స్టార్స్ ట్వీట్లు చేశారని... కానీ జగన్, పేర్ని నాని మాత్రం ఈ భేటీపై కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదని చెప్పారు.
జగన్ 'రియల్ మెగా సూపర్ డూపర్ ఒమేగా స్టార్' అని వర్మ అన్నారు. మహేశ్ బాబు, చిరంజీవి, ప్రభాస్ తదితరులు ఒమేగా స్టార్ (జగన్) చూట్టూ జూనియర్ ఆర్టిస్టుల్లా కూర్చోవడమే దీనికి ఉదాహరణ అని ఎద్దేవా చేశారు. రీల్ ఫిల్మ్ లో ఫ్రేమ్ మధ్యలో మహేశ్, చిరంజీవి, ప్రభాస్ తదితరులు పంచ్ డైలాగులు కొడుతుంటారని... కానీ రియల్ లైఫ్ లో ఫ్రేమ్ మధ్యలో జగన్ ఉన్నారని అన్నారు. జగన్ కు వారంతా భయపడ్డారని, భిక్ష కోసం జూనియర్ ఆర్టిస్టుల్లా అడుక్కున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్టార్ల కంటే జగనే ఎక్కువని నిరూపితమయిందని అన్నారు.
ఒమేగా స్టార్ జగన్ ను చూసి తాను ఆశ్చర్యపోయానని... ఎందుకంటే సూపర్ మెగాస్టార్స్ అందరినీ ఒక్క లైనులో 'హీరోలు అందరూ జీరోలు' అని నిరూపించారని వర్మ ఎద్దేవా చేశారు.