trains: ఇక మీదట అన్ని రైళ్లలో కేటరింగ్ సేవలు
- ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం
- ప్రయాణికులకు వండిన ఆహార సేవలు
- కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలు అనుసరణ
- ఐఆర్సీటీసీ తాజా ప్రకటన
రైలు ప్రయాణికులకు ఐఆర్సీటీసీ తీపి కబురు చెప్పింది. ప్రేమికుల దినోత్సవం అయిన ఫిబ్రవరి 14 నుంచి అన్ని రైళ్లలోనూ కేటరింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. అంటే ప్రయాణికులకు వండిన ఆహారాన్ని అందించనుంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వండిన ఆహారంతోపాటు, రెడీ టు మీల్స్ సేవలను సైతం కొనసాగించనుంది.
అయినప్పటికీ ఐఆర్సీటీసీ ఉద్యోగులు కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలను పాటిస్తారని తెలిపింది. ఈ నిర్ణయంతో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి సౌకర్యం ఏర్పడనుంది. తాజగా వండిన ఆహారం వారికి లభించనుంది. వాస్తవానికి వండిన ఆహార తయారీ, సరఫరా సేవలను ఐఆర్సీటీసీ జనవరి చివరికి 80 శాతం రైళ్లలో ప్రారంభించింది. ఇప్పుడు మిగిలిన 20 శాతం రైళ్లకూ ఇది అమలు చేయనుంది. గత డిసెంబర్ లోనే రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ఈ సేవలను తిరిగి ఆరంభించింది.