Bravo: ఉత్కంఠగా సాగుతున్న ఐపీఎల్ వేలం.. ఢిల్లీకి వార్నర్, ఆర్సీబీలోకి డూప్లెసిస్
- వార్నర్ కు 6.25 కోట్లు
- డూప్లెసిస్ కు 7కోట్లు
- లక్నో జట్టుకు డీకాక్
- రాజస్థాన్ రాయల్స్ కు షమీ
ఐపీఎల్ మెగా వేలం బెంగళూరులో ఎంతో ఉత్కంఠ మధ్య కొనసాగుతోంది. సన్ రైజర్స్ అవమానకరంగా విడిచిపెట్టిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ తన్నుకుపోయింది. 6.25 కోట్ల బిడ్ తో సొంతం చేసుకుంది. ఇతడి కోసం సీఎస్కే, ముంబై ఇండియన్స్ పోటీ పడ్డాయి. చివరికి ఢిల్లీ విజయం సాధించింది.
దక్షిణాఫ్రికా క్రికెటర్, వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ ను 6.75 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. ఇది కొత్త ఫ్రాంచైజీ. కనుక వికెట్ కీపర్, మంచి బ్యాటర్ గా అతడి సేవలను జట్టు వినియోగించుకునే అవకాశం ఉంది.
ముంబై ఇండియన్స్ కు వరుసగా మూడు సీజన్లలో మెరుగైన సేవలను డీకాక్ అందించాడు. రిటెన్షన్ కారణంగా అతడ్ని ముంబై ఇండియన్స్ విడుదల చేసింది. అయినా మరోసారి అతడ్ని సొంతం చేసుకునేందుకు పోటీలోకి దిగింది. రూ4.60 కోట్ల వరకు ఆఫర్ చేసింది. కానీ, లక్నో జట్టే గెలిచింది.
ఫాప్ డుప్లెసిస్ కోసం సీఎస్కే కష్టపడినా ఫలితం దక్కలేదు. ఆర్సీబీ, ఢిల్లీ, లక్నో జట్లు కూడా అతడి కోసం బరిలోకి దిగాయి. ఢిల్లీ, ఆర్సీబీ మధ్య ప్రధానంగా వేలం పోటీ నడిచింది. చివరికి ఆర్సీబీ 7 కోట్లతో అతడ్ని గెలుచుకుంది.
మహమ్మద్ షమీ కోసం ఆర్సీబీ బిడ్డింగ్ తో వేలం మొదలైంది. గుజరాత్ టైటాన్స్ 3 కోట్లు ఆఫర్ చేయగా, తర్వాత లక్నో, కేకేఆర్ కూడా పోటీ పడ్డాయి. చివరికి 6.25 కోట్ల ఆఫర్ తో గుజరాత్ టైటాన్స్ షమీని సొంతం చేసుకుంది.
ట్రెంట్ బౌల్ట్ ను 8 కోట్లతో రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలుచుకుంది. అతడి కోసం ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ కూడా పోటీ పడ్డాయి.
సీఎస్కే జట్టు బ్రావోను ఎట్టకేలకు మళ్లీ తానే గెలుచుకుంది. ఎన్నోఏళ్లుగా బ్రావో సీఎస్కే జట్టు సభ్యుడిగా ఉన్నాడు. రిటెన్షన్ విధానంలో భాగంగా అతడ్ని విడుదల చేసిన సీఎస్కే 4.4 కోట్లతో వేలంలో తిరిగి సొంతం చేసుకుంది.
నితీష్ రాణాను రూ.8 కోట్లతో కేకేఆర్, జేసన్ హోల్డర్ ను రూ.8 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ గెలుచుకున్నాయి.