FAPTO: ముగిసిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల భేటీ... కార్యాచరణ ప్రకటించిన ఫ్యాప్టో
- విజయవాడలో సమావేశం
- హాజరైన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు
- భేటీ వివరాలు తెలిపిన ఫ్యాప్టో కార్యదర్శి
- వచ్చే నెలలో రిలే నిరాహార దీక్షలు
విజయవాడలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల సమావేశం ముగిసింది. అనంతరం ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఫ్యాప్టో భవిష్యత్ కార్యాచరణ వెల్లడించింది. ఈ నెల 14, 15 తేదీల్లో సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తామని ఫ్యాప్టో కార్యదర్శి శరత్ చంద్ర తెలిపారు. తమ ఉద్యమ కార్యాచరణపై ఈ నెల 14న సీఎస్ కు నోటీసు ఇస్తామని వివరించారు. పీఆర్సీ పునఃసమీక్షించాలని కోరుతూ ఈ నెల 15 నుంచి 20 వరకు సంతకాల సేకరణ ఉంటుందని అన్నారు.
ఈ నెల 21 నుంచి 24 మధ్య ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లతో బ్యాలెట్ల నిర్వహణ చేపడతామని వివరించారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు విజ్ఞాపనలు ఇస్తామని శరత్ చంద్ర వెల్లడించారు. ఈ నెల 25న ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాస్తామని చెప్పారు. మార్చి 2, 3 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద రిలే నిరాహార దీక్షలు ఉంటాయని, మార్చి 7, 8 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు ఉంటాయని తెలిపారు.
కాగా, ఫ్యాప్టో అధ్యక్షుడు సుధీర్ బాబు మాట్లాడుతూ, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 27 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని స్పష్టం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్ధీకరించాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ, డీఏ, టీఏలు ఇవ్వాలని పేర్కొన్నారు.