Harish Rao: ఆసుపత్రుల్లో పేదలు చనిపోతే వారి పార్థివ దేహాలను ఇళ్లకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం: హరీశ్ రావు
- పేదలకు వైద్యం అందించడంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది
- హైదరాబాద్ నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రారంభిస్తాం
- కరోనా సమయంలో వైద్య సిబ్బంది ఎంతో కష్టపడ్డారు
పేదలకు సరైన వైద్యాన్ని అందించడం టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలలో ఒకటని రాష్ట్ర ఆరోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. పేద ప్రజలకు వైద్యాన్ని అందించడంలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలు చనిపోతే.. వారి పార్థివ దేహాలను వారి ఇళ్లకు పంపడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో ఓపీ బ్లాక్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద అంబులెన్సులు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని హరీశ్ చెప్పారు. హైదరాబాదుకు నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. కరోనా సమయంలో వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి కష్టపడ్డారని కొనియాడారు.