Arvind Kejriwal: పంజాబ్ సీఎం చన్నీ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవడు: కేజ్రీవాల్
- ఈ నెలలో పంజాబ్ ఎన్నికలు
- గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ
- ఇప్పటికే మూడుసార్లు సర్వే
- ఓటర్లు తమవైపే ఉన్నారన్న కేజ్రీవాల్
పంజాబ్ రాజకీయాల్లో పాగా వేయాలని భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికలపై కన్నేసింది. ఇప్పటికే పలు రూపాల్లో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తూ, అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ప్రజల నుంచి టెలిపోల్ ద్వారా అభిప్రాయసేకరణ జరిపారు. ఈ టెలిపోల్ ఫలితాలను కేజ్రీవాల్ నేడు వెల్లడించారు.
పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ ఈసారి ఎమ్మెల్యేగా కూడా గెలవబోడని తెలిపారు. చన్నీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చంకౌర్ సాహిబ్, భదౌర్ నియోజకవర్గాల్లో బరిలో దిగుతున్నారని, ఈ రెండు స్థానాల్లో ఆయన ఓడిపోతారని వివరించారు. తాము మూడుసార్లు సర్వే నిర్వహించామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
చన్నీ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోతే, పంజాబ్ కు ఇంకెవరు సీఎం అవుతారు? అని ప్రశ్నించారు. చంకౌర్ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీకి 52 శాతం ఓట్లు వస్తాయని, భదౌర్ లో 48 శాతం ఓట్లు లభిస్తాయని చెప్పారు.