India: చైనాకు మరో షాక్.. 54 యాప్‌లపై భారత్ నిషేధం?
- చైనా పాప్యులర్ యాప్‌లపై బ్యాన్
- స్వీట్ సెల్ఫీ హెడ్, బ్యూటీ కెమెరా-సెల్ఫీ కెమెరాపై కూడా నిషేధం
- దేశ భద్రతకు ముప్పు కలిగించేలా యాప్‌లు
- ఇప్పటికే పలు యాప్‌లపై నిషేధం
చైనాకు భారత్ మరోసారి షాక్ ఇచ్చింది. చైనాకు చెందిన 54 యాప్‌లను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా పాప్యులర్ యాప్‌లు స్వీట్ సెల్ఫీ హెడ్, బ్యూటీ కెమెరా-సెల్ఫీ కెమెరా, వివా వీడియో ఎడిటర్, టెన్సెంట్ జీవర్, ఒన్‌మోజీ ఎరినా, యాప్ లాక్ వంటివి కూడా ఈ జాబితాలో ఉన్నాయి. దేశ భద్రతకు ముప్పు కలిగించేలా ఆ యాప్‌లు ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ 54 యాప్‌లు చాలా ముఖ్యమైన డేటా అనుమతులు అడుగుతూ సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ యాప్‌లు రియల్ టైమ్ డేటాను తీసుకుంటున్నాయని ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని చెప్పాయి. కాగా, గత ఏడాది జూన్‌లో చైనాకు చెందిన 59 యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే.
వాటిల్లో టిక్ టాక్, వీచాట్, హలో వంటి పాప్యులర్ యాప్‌లు కూడా ఉన్నాయి. చైనాకు చెందిన వేలాది యాప్‌లలో అతి ముఖ్యమైన యాప్‌లను భారత్ నిషేధిస్తోంది. వాటి ద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉండడంతో 2020 నుంచి ఇప్పటి వరకు మొత్తం 300 యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.