Sri Ramanuja Millennium Celebrations: ముచ్చింతల్ లో ముగిసిన రామానుజ సహస్రాబ్ది వేడుకలు
- గత 12 రోజులుగా సహస్రాబ్ది వేడుకలు
- స్వర్ణమూర్తికి ప్రాణప్రతిష్ట చేసిన చిన్నజీయర్
- శాంతి కల్యాణం వాయిదా
- ఈ నెల 19న శాంతికల్యాణం
- చారిత్రాత్మక రీతిలో ఉంటుందన్న చిన్నజీయర్
విశ్వ సమతామూర్తి, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యం చేసిన శ్రీరామానుజాచార్యుల వారి సహస్రాబ్ది వేడుకలు నేటితో ముగిశాయి. అయితే, 108 దివ్యక్షేత్రాల్లో నిర్వహించాల్సిన శాంతి కల్యాణాన్ని వాయిదా వేశారు. ఈ నెల 19న చారిత్రాత్మక రీతిలో ఈ కల్యాణాన్ని చేపడతామని చిన్నజీయర్ స్వామి వెల్లడించారు.
ఇక సహస్రాబ్ది వేడుకల ఆఖరి రోజున 5 వేల మంది రుత్విక్కులతో లక్ష్మీనారాయణ మహాయాగం నిర్వహించారు. చిన్నజీయర్ స్వామి 1,035 పాలికల్లోని సంప్రోక్షణ జలాలతో సమతామూర్తి పసిడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేశారు.
ముచ్చింతల్ ఆశ్రమంలోని శ్రీరామనగరంలో గత 12 రోజులుగా చేపట్టిన సహస్రాబ్ది వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై తరించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 216 అడుగుల ఎత్తయిన సమతామూర్తి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.